వింబుల్డన్ నాలుగో రౌండ్లోనే టాప్ సీడ్ అవుట్

  • బార్టీకి 55వ ర్యాంకర్ షాక్ 
  • క్వార్టర్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ 
  • పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో నడాల్

వింబుల్డన్ మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు ఫ్రెంచ్ ఓపెన్ కింగ్ రాఫెల్ నడాల్ అలవోకగా చేరుకొన్నాడు.

ఆల్ ఇంగ్లండ్ క్లబ్ గ్రాస్ కోర్టులో ముగిసిన నాలుగో రౌండ్ మ్యాచ్ లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ యాష్లీగీ బార్టీని మూడుసెట్ల పోరులో.. అమెరికా అన్ సీడెడ్ ప్లేయర్ అలీసన్ రిస్కీ కంగు తినిపించింది.

బార్టీ 6-3, 2-6, 3-6తో ఓటమి పాలయ్యింది. బార్టీ 15 మ్యాచ్ ల విజయపరంపరకు వింబుల్డన్ నాలుగో రౌండ్ ఓటమితో బ్రేక్ పడినట్లయ్యింది.

క్వార్టర్స్ లో అమెరికన్ బ్లాక్ థండర్…

23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ విన్నర్, మాజీ చాంపియన్, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ సైతం క్వార్టర్ ఫైనల్స్ చేరింది.

నాలుగోరౌండ్ పోటీలో 37 ఏళ్ల సెరెనా 6-2, 6-2తో స్పెయిన్ ప్లేయర్ క్లారా సారేజ్ నవారోను చిత్తు చేసింది. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం సెరెనాకు ఇది 14వసారి.

స్పానిష్ బుల్ టాప్ గేర్…

ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్, రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ రాఫెల్ నడాల్..పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. నాలుగో రౌండ్ పోటీలో జావో సాసాను 6-2, 6-2, 6-2తో చిత్తు చేసి తన సత్తా చాటుకొన్నాడు. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం 3వ సీడ్ నడాల్ కు ఇది ఏడోసారి.

టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, రెండోసీడ్ రోజర్ ఫెదరర్ సైతం క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నారు.