యూపీలో ఘోర ప్రమాదం.. బస్సు డ్రైనేజీలో పడి 29 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న యూపీ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డ్రైనేజీ కాల్వలో పడింది. ఈ ఘటనలో 29 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

బస్సు ప్రమాద ఘటన వార్త తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆగ్రా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.

బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో హైవేపై వంతెనను ఢీకొని 15 అడుగుల లోతులో ఉన్న ఝర్న నాలాలో పడినట్లు యూపీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికి తీశామని.. బాధిత కుటుంబసభ్యులు 9454403732 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు యూపీఎస్ ఆర్టీసీ 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది.