పార్లమెంట్‌లో వైఎస్‌ విగ్రహం కోసం లేఖ

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. పార్లమెంట్‌ లో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. రూపాయికి వైద్య సేవలు అందించడంతో పాటు… ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని లేఖలో వివరించారు.

ఆరోగ్య శ్రీ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలవరం, పులిచింతల ప్రాజెక్టులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు వైఎస్‌ఆర్‌ అని బాలశౌరి కీర్తించారు.

వైఎస్‌ తీసుకొచ్చిన పథకాలు దేశంలో వివిధ రాష్ట్రాలకు కూడా స్పూర్తిగా నిలిచాయన్నారు. కాబట్టి వైఎస్‌ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేసి ఆయన్ను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు బాలశౌరి.