విజయ్ దేవరకొండ హీరో కాకపోయి ఉంటే..?

ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకడు విజయ్ దేవరకొండ. ఇలాంటి నటుడు హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు. సాధారణంగా ఇలా ఎవరూ ఆలోచించరు. కానీ ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దగ్గర సమాధానం ఉంది. అవును.. విజయ్ దేవరకొండ హీరోగా మారకపోయి ఉంటే కచ్చితంగా దర్శకుడు అయ్యేవాడని అంటున్నాడు ఆనంద్.

“అన్నయ్య గురించి పూర్తిగా నాకు తెలుసు. సినిమా ఛాన్సుల కోసం అన్న ఎంత కష్టపడ్డాడో నేను చూశాను. కానీ హీరోగా కాకపోయి ఉంటే అన్న ఇండస్ట్రీని మాత్రం వదిలేవాడు కాదు. ఎఁదుకంటే, అప్పటికే అన్న చాలా కథలు రాసుకున్నాడు. అందులో 2-3 కథలైతే టోటల్ స్క్రీన్ ప్లేతో పాటు రెడీగా ఉన్నాయి. కాబట్టి హీరో కాకపోయి ఉంటే అన్న కచ్చితంగా డైరక్టర్ అయ్యేవాడు.”

దొరసాని సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అన్న సినీ ప్రయాణాన్ని తను దగ్గరుండి చూశానని, సినిమా కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసంటున్నాడు.

“అన్న‌ది ప‌దేళ్ళ ప్ర‌యాణం. అందులో చాలా చూసాడు. అన్న‌తో పాటు ఒక సారి ఆడిష‌న్స్ కి వెళ్ళాను. సెలెక్ట్ అవ‌లేదు ఆ రోజు అన్న ఎంత బాధ ప‌డ్డాడో నేను ద‌గ్గ‌ర‌నుండి చూసాను. నాన్న సీరియ‌ల్స్ డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్క‌ష‌న్స్ ఉండేవి.”

దొరసాని సినిమాలో తనలో హీరో కనిపించడని అంటున్నాడు ఆనంద్. కేవలం కథను నమ్మి సినిమా చేశానని, హీరోగా మాత్రం కనిపించనని స్పష్టత ఇచ్చాడు. ఈనెల 12న థియేటర్లలోకి వస్తోంది దొరసాని.