ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో రికార్డుల మోత

  • 45 మ్యాచ్ ల్లో పరుగుల జోరు, సెంచరీల హోరు
  • 8 మ్యాచ్ ల్లో 647 పరుగులతో రోహిత్ శర్మ టాప్ 
  • 9 మ్యాచ్ ల్లో 26 వికెట్ల మిషెల్ స్టార్క్ 
  • 8 మ్యాచ్ ల్లో 7విజయాలతో టాపర్ గా భారత్

2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలిదశ 45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ పోరు ముగియడంతోనే నాకౌట్ సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమయ్యింది.

అంచనాలకు తగ్గట్టుగా రాణించడం ద్వారా …ప్రపంచ నంబర్ వన్ భారత్, రెండో ర్యాంకర్ ఇంగ్లండ్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ సెమీఫైనల్స్ రౌండ్ కు అర్హత సంపాదించాయి.

రౌండ్ రాబిన్ లీగ్ లో రికార్డుల మోత…

ఇంగ్లండ్ లోని బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లపై జరిగిన 10 జట్లు…45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ పోరు పరుగుల జోరు, సెంచరీల హోరుతో సాగింది.

గత ప్రపంచకప్ టోర్నీలకు భిన్నంగా రికార్డు స్థాయిలో అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి.

మొత్తం 45రౌండ్ల మ్యాచ్ ల్లో 31 శతకాలు నమోదు కావడం చూస్తే..బ్యాట్స్ మన్ జోరు ఏస్థాయిలో సాగిందీ మరి చెప్పాల్సిన పనిలేదు.

రోహిత్ శర్మ పాంచ్ పటాకా…

2019 ప్రపంచకప్ తొలిశతకాన్ని సాధించిన ఘనతను ఆతిథ్య ఇంగ్లండ్ వన్ డౌన్ ఆటగాడు జో రూట్ దక్కించుకొంటే…రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి మ్యాచ్ లో శతక్కొట్టిన ఆటగాడి ఘనతను ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సొంతం చేసుకొన్నాడు.

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కడే ఐదు సెంచరీలు సాధించడం ద్వారా నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లతో జరిగిన పోటీలలో రోహిత్ సెంచరీలు నమోదు చేశాడు. 

సింగిల్ ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. రోహిత్ మొత్తం 8 ఇన్నింగ్స్ లో 647 పరుగులతో.. టాప్ రన్ గెట్టర్ గా నిలిచాడు. 92.42 సగటు నమోదు చేశాడు.

రెండోస్థానంలో డేవిడ్ వార్నర్…

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడు శతకాలతో రెండోస్థానంలో ఉన్నాడు. రెండేసి సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో
జో రూట్, ఆరోన్ ఫించ్, కేన్ విలియమ్స్ సన్, షకీబుల్ హసన్, బెయిర్ స్టో ఉన్నారు.

సింగిల్ సెంచరీలు 13

ఒక్కో సెంచరీ చొప్పున సాధించిన ఆటగాళ్లలో కార్లోస్ బ్రాత్ వెయిట్, ముష్ ఫికుర్ రహీం, శిఖర్ ధావన్, జేసన్ రాయ్, వోయిన్ మోర్గాన్ మహ్మద్ హఫీజ్, బాబర్ అజామ్, అవిష్క ఫెర్నాండో, పూరన్, ఇమాముల్ హక్, ఏంజెలో మాథ్యూస్, ఫాబ్ డూప్లెసిస్, కెఎల్. రాహుల్ ఉన్నారు.

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్ కలసి ఎనిమిది శతకాలు బాదటం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. మొత్తం 45 రౌండ్లలో వర్షం దెబ్బతో రద్దయిన మ్యాచ్ లు పోను మిగిలిన మ్యాచ్ ల్లో 31 సెంచరీలు నమోదు కావడం సరికొత్త ప్రపంచకప్ రికార్డుగా మిగిలిపోతుంది.

రోహిత్ శర్మ, షకీబుల్ హసన్, డేవిడ్ వార్నర్ 600కు పైగా పరుగులు సాధించిన మొనగాళ్లుగా నిలిచారు.

షకీబుల్ హసన్ ఆల్ రౌండ్ షో…

బంగ్లాదేశ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ 606 పరుగులు, 11 వికెట్లు సాధించిన తొలి ఆల్ రౌండర్ గా ప్రపంచకప్ రికార్డు సొంతం చేసుకొవ్నాడు.

బౌలింగ్ లో మొనగాడు మిషెల్ స్టార్క్…

ఇంగ్లీష్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ లపై..వివిధ జట్లకు చెందిన లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్లు చేలరేగిపోయారు. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 45 మ్యాచ్ లు ముగిసే సమయానికి…కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 26 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు.

ఆస్ట్రేలియా మరోసారి సెమీఫైనల్స్ చేరడంలో లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ ప్రధానపాత్ర వహించాడు. రౌండ్ రాబిన్ లీగ్ 9 రౌండ్లలో కంగారూ టీమ్ ఆడిన మ్యాచ్ ల్లో స్టార్క్ మొత్తం 83.2 ఓవర్లలో 5 మేడిన్ ఓవర్లతో 432 పరుగులిచ్చి 26 వికెట్లు సాధించాడు. అంతే కాదు…రెండు సార్లు 5 వికెట్ల చొప్పున పడగొట్టాడు.

బ్యాటింగ్ లో ఓ ఆటగాడు సెంచరీ సాధిస్తే ఎంత గొప్పో… బౌలింగ్ లో ఓ బౌలర్ మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టినా అంతే గొప్పగా పరిగణిస్తారు.

రెండో స్థానంలో ముస్తాఫిజుర్…

బంగ్లాదేశ్ లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్…8 రౌండ్లలో 20 వికెట్లు పడగొట్టి రెండోస్థానంలో నిలిచాడు.

ఇక…న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ల్యూక్ ఫెర్గూసన్ కేవలం 7 మ్యాచ్ ల్లోనే 63.4 ఓవర్లు బౌల్ చేసి…17 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం 9 రౌండ్లలో 80.5 ఓవర్లు బౌల్ చేసి …387 పరుగులిచ్చి 17 వికెట్ల రికార్డుతో మూడో స్థానంలో నిలిచాడు.

భారత ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా 8మ్యాచ్ ల్లో ..332 పరుగులిచ్చి 17 వికెట్లు సాధించడం ద్వారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెరో 17 వికెట్లతో ఐదు, ఆరు స్థానాలలో ఉన్నారు.

రెండే హ్యాట్రిక్ లు…

ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో కేవలం రెండంటే రెండుమాత్రమే హ్యాట్రిక్ లు నమోదయ్యాయి.

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ..అఫ్ఘనిస్థాన్ పైన, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్…ఆస్ట్రేలియా పైన హ్యాట్రిక్ లు సాధించారు.

స్పిన్నర్లలో షకీబుల్ టాప్…

ఫాస్ట్ బౌలర్ల షోగా సాగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లుగా బంగ్లాదేశ్ సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్, భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ సంయుక్త ఆగ్రస్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ చెరో 11 వికెట్లు చొప్పున పడగొట్టారు.

షకీబుల్ 8 మ్యాచ్ ల్లో 11 వికెట్లు సాధిస్తే…చహల్ సైతం 7 మ్యాచ్ ల్లో 379 పరుగులిచ్చి 11 వికెట్లే తీయడం విశేషం.

లెఫ్టామ్ పేసర్ల దూకుడు…

ప్రపంచకప్ మొదటి 45 మ్యాచ్ ల్లో… వివిధ జట్లకు చెందిన లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యమే కొనసాగింది. ఆస్ట్రేలియాఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్, న్యూజిలాండ్ ఓపెనింగ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, పాక్ ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ అమీర్, బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్, విండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కోట్రెల్, పాక్ యువపేసర్ మహ్మద్ షహీన్ అఫ్రిదీ… ఇలా అందరూ ఎడమచేతి వాటం బౌలర్లే కావడం విశేషం. 

సెమీఫైనల్స్ నాకౌట్, టైటిల్ సమరంలో మరెన్ని సెంచరీలు నమోదవుతాయో…వికెట్లు పడతాయో వేచిచూడాల్సిందే.