ధర్మవరంలోకి పరిటాల ఎంట్రీపై కేతిరెడ్డి హెచ్చరిక

ధర్మవరం నియోజక వర్గం టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా మారిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. తాము 25 ఏళ్ల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నామని… కానీ టీడీపీ తరపున ఇటీవల ఏ ఒక్క నాయకుడైనా ఐదేళ్లకు మించి ధర్మవరంలో రాజకీయం చేసి నిలబడగలుగుతున్నారా అని ప్రశ్నించారు.

వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో కొత్తగా పరిటాల కుటుంబాన్ని ధర్మవరం తెస్తామంటున్నారని… పరిటాల కుటుంబాన్ని తెచ్చి ఇక్కడ శాంతి స్థాపన ఎలా చేస్తారని నిలదీశారు. జిల్లాలో గతంలో ఆర్‌వోసీ ఎలా వచ్చింది… దాని వెనుక ఏ కుటుంబం ఉంది అన్నది అందరికీ తెలుసన్నారు.

అలాంటి కుటుంబాన్ని తెచ్చి ధర్మవరంలో మరోసారి అలజడి రేపాలనుకుంటే మాత్రం సహించబోమన్నారు. హడావుడి బ్యాచ్‌ రాజకీయాలు ధర్మవరంలో సాగవన్నారు.

అలాంటి వారిని ధర్మవరం ప్రజలు కాలగర్భంలో కలిపేశారన్నారు. ఇక్కడ ప్రజలు ఎవరి కాళ్లు పట్టుకోరని… ఇక్కడి ప్రజల కాళ్లు పట్టుకునే వారే ఇక్కడికి నాయకులుగా రావాల్సి ఉంటుందన్నారు. గతంలో ఆర్‌వోసీ పేరుతో ధర్మవరం నియోజకవర్గంలో సాగించిన హత్యలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలన్నారు కేతిరెడ్డి.

ధర్మవరం నియోజకవర్గంలోకి ఫ్యాక్షన్ తెస్తామంటే ఎంతటి పెద్దవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తామంటే చేతులు ముడుచుకుని కూర్చునే ప్రసక్తే ఉండదన్నారు.