బోయపాటి… ఇప్పుడు ప్రొడ్యూసర్లను కూడా భయపెడుతున్నాడు..!

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అంటే మాస్ సినిమాలకి పెట్టింది పేరు. కానీ ‘వినయ విధేయ రామ’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న తర్వాత బోయపాటి తో సినిమా అంటే హీరోలు మాత్రమే కాక ఇప్పుడు నిర్మాతలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.

తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కాల్సింది. ఈ సినిమాని దిల్ రాజు స్వయంగా నిర్మించాల్సి ఉంది. బోయపాటి… బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ కాబట్టి దిల్ రాజు ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడు. కానీ బోయపాటి చెప్పిన బడ్జెట్ విన్నాక దిల్ రాజు కరాఖండిగా నో చెప్పేశాడట. బోయపాటి ఈ సినిమా కోసం ఏకంగా 70 కోట్ల బడ్జెట్ అడిగినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ మార్కెట్ కూడా ప్రస్తుతానికి అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిర్మాత వీరిద్దరితో అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు.

ఇంతకుముందు కూడా బడ్జెట్ విషయంలోనే ‘భారతీయుడు 2’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు దిల్ రాజు.

మరోవైపు ప్రస్తుతం బాలకృష్ణ కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బాలకృష్ణ-అనిల్ రావిపూడి మరియు బాలయ్య-వి.వి.వినాయక్ చిత్రాలను దిల్ రాజు వచ్చే ఏడాది నిర్మించనున్నాడు.