నిహారిక కొణిదెల…. నిర్మాతగా మారబోతుందా?

మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొట్టమొదటి అమ్మాయి నిహారిక కొణిదెల. ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్ సిరీస్ లో కనిపించిన ఈ మెగా ప్రిన్సెస్ ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

అయితే మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్న నిహారిక కొణిదెల ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది…. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

ఇక ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ లో తన తండ్రి నాగబాబు తో కలిసి నటించిన నిహారిక కొణిదెల ఈ మధ్యనే ‘సూర్యకాంతం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

అయితే తాజాగా నిహారిక కొణిదెల తన కెరీర్ గురించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన నిహారిక ఇప్పుడు హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక స్వయంగా నిర్మాతగా మారబోతోందట. అయితే తాను నిర్మించనున్న మొదటి సినిమాలో మెగా హీరో నటించనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇదే గనుక నిజమైతే మెగా కుటుంబం నుంచి మరో నిర్మాత కూడా బయటకు వచ్చినట్టే.