ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్

  • విరాట్ సేనకు న్యూజిలాండ్ షాక్ 
  • జడేజా, ధోనీ పోరాడినా తప్పని ఓటమి

ప్రపంచకప్ తొలిసెమీస్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. రెండుసార్లు విజేత, రెండోర్యాంకర్ భారత్ పై న్యూజిలాండ్ 18 పరుగులతో సంచలన విజయం నమోదయ్యింది.

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో భారత్ విజయం అంచుల వరకూ వచ్చి …పోరాడి ఓడింది.

వర్షం దెబ్బతో రెండురోజుల పాటు సాగిన ఈమ్యాచ్ లో…ఓవర్ నైట్ స్కోరుతో రిజర్వ్ డే నాడు బ్యాటింగ్ కొనసాగించిన కివీస్ ను భారత బౌలర్లు 239 పరుగులకు కట్టడి చేశారు. కివీ మాజీ కెప్టెన్ రోజ్ టేలర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

టాపార్డర్ టపటపా….

240 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ టాపర్డర్ పేకమేడలా కూలింది. ఓపెనర్లు రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ.. కేవలం ఒక్కో పరుగు స్కోర్లకే పెవీలియన్ దారి పట్టారు.

మిడిలార్డర్లో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ధోనీ పోరాడటంతో భారత్ విజయానికి చేరువయ్యింది. ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించిన ధోనీని కివీ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది.

రవీంద్ర జడేజా కేవలం 59 బాల్స్ లోనే 4 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ విజయంలో ప్రధాన పాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలలో న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత్ ఓటమి పొందటం ఇదే మొదటిసారి కాదు. న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత్ కు కేవలం 27 శాతం మాత్రమే విజయాలు ఉండటం విశేషం.

విరాట్ కొహ్లీ నాయకత్వంలో ప్రపంచకప్ సాధించాలన్న భారత ఆశలు…న్యూజిలాండ్ కొట్టిన దెబ్బతో అడియాసలుగా మిగిలిపోయాయి.