వార్డు మెంబర్‌గా గెలువు – నారా లోకేష్‌పై టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్

టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పదవుల్లో లేని నేతలే కాదు… పదవులు ఉన్న వారు కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీకి రాజీనామా చేయగా… ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ రాజీనామా చేశారు.

పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారాయన. మండలి కార్యదర్శిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. 2014లో తెనాలి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అన్నం సతీష్‌… కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌పై అన్నం సతీష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ వల్లే టీడీపీ దారుణంగా ఓడిపోయిందన్నారు. టీడీపీని హెరిటేజ్ కంపెనీలా తయారు చేశాడని మండిపడ్డారు.

ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎప్పుడో చచ్చిపోయిందని… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందన్నారు. నారా లోకేష్‌ కు సిగ్గుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కనీసం వార్డు మెంబర్‌గానైనా గెలిచి రావాలని సవాల్ చేశారు అన్నం సతీష్‌.