అసెంబ్లీలో నీటి మంటలు

గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే అంశంపై అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. జగన్‌మోహన్ రెడ్డి, చంద్రబాబు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లడాన్ని టీడీపీ విమర్శించడంపై జగన్ తీవ్రంగా స్పందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాదా అని జగన్‌ నిలదీశారు. తాను ముఖ్యమంత్రి అయ్యే సరికి కాళేశ్వరం నిర్మాణం అయిపోయిందని… తాను అక్కడికి వెళ్లినా… వెళ్లకపోయినా… ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగేదన్నారు. కానీ పొరుగు రాష్ట్రంతో మంచి సంబంధాలుండాలన్న ఉద్దేశంతోనే తాను ప్రారంభోత్సవానికి వెళ్లానన్నారు.

చంద్రబాబు హయాంలోనే కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకుంటూ పోయిందని ఇప్పుడు కేటాయింపుల్లో సగం నీరు కూడా కిందకు వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు.

ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. గోదావరి జలాలను కృష్ణకు తరలించే ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య రాతపూర్వక ఒప్పందాలుంటాయని జగన్ వివరించారు.

చంద్రబాబు మాత్రం గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించడం అన్నది…. జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత అంశం కాదని…. ఆ విషయం ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి నీటిని తరలించడం సరికాదన్నారు. భవిష్యత్తులో తెలంగాణ… ప్రాజెక్టు నుంచి నీటిని అడ్డుకునే అవకాశం ఉంటుందని… కాబట్టి తెలంగాణ నేల మీద నుంచి నీటి తరలింపు సరికాదన్నారు.