భార్య కన్సల్టెన్సీతో బొల్లినేని గాంధీ బాగోతం

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మాజీ ఈడీ జాయింట్ డైరెక్టర్, ప్రస్తుతం జీఎస్‌టీ సూపరింటెండెంట్‌గా ఉన్న బొల్లినేని గాంధీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

సీబీఐ దాడుల తర్వాత బాధితులు మరిన్ని వివరాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా పలువురు వ్యాపారులను కూడా బొల్లినేని గాంధీ తనదైన శైలిలో వేధించి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు సీబీఐ గుర్తించింది.

తన భార్య శిరీషా పర్యవేక్షణలో ఒక కన్సల్టెన్సీని బొల్లినేని గాంధీ ఏర్పాటు చేయించాడు. ఈడీలో ఉన్నప్పుడు ఏ కంపెనీ పైన అయినా ఫిర్యాదు వస్తే కంపెనీ వారికి నోటీసులు ఇచ్చి బెదరగొట్టేవాడు. కంపెనీ వాళ్లు తన వద్దకు రాగానే మరింత భయపెట్టి తన భార్య నిర్వహిస్తున్న కన్సల్టెన్సీ వద్దకు పంపించేవాడు.

అక్కడ కన్సల్టెన్సీలో భారీగా డబ్బులు చెల్లించగానే ఇక సదరు కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయేవాడు బొల్లినేని గాంధీ. ఈడీలో ఉన్నప్పుడే కాకుండా జీఎస్‌టీ విభాగంలోకి వచ్చిన తర్వాత కూడా తన భార్య నిర్వహిస్తున్న కన్సల్టెన్సీ ద్వారానే వ్యాపారుల ద్వారా ఈయన డబ్బులు వసూలు చేసినట్టు చెబుతున్నారు.

వ్యాపారులకు నోటీసులు ఇచ్చి బెదరగొట్టడం … వారు రాగానే కన్సల్టెన్సీ వద్దకు పంపడం , అక్కడ బొల్లినేని గాంధీ భార్య శిరీషా డబ్బులు తీసుకోడం .. అంతటితో ఆ కేసును నీరుగార్చడం…. ఇదే బొల్లినేని గాంధీ తొలి నుంచి కూడా అనుసరించిన దోపిడి వ్యూహంగా చెబుతున్నారు. ఇలా బొల్లినేని గాంధీ దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టాడు.

సూజనాచౌదరి కంపెనీలో చాలా ఫిర్యాదులు రాగా… వాటన్నింటినీ ఒకే ఫిర్యాదుగా మార్చి కేసును నీరు గార్చేందుకు బొల్లినేని గాంధీ ప్రయత్నించాడు. 13 ఏళ్ల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో బొల్లినేని గాంధీ ఉండగా.. మధ్యమధ్యలో మూడు సార్లు బదిలీ ఆదేశాలు వచ్చాయి. కానీ చంద్రబాబు సాయంతో వాటిని నిలిపివేయించుకుని హైదరాబాద్‌లోనే 13 ఏళ్ల పాటు ఈడీని ఇష్టానికి ఏలారు బొల్లినేని గాంధీ.