అసెంబ్లీలో బాబు వీడియోల ప్రదర్శన

రాష్ట్రంలో కరువు, నీటి ఎద్దడి, రైతు సమస్యలపై జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48.3 శాతం వర్షపాతం లోటు ఉందని వివరించారు. విత్తనాల కొరతకు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విత్తనాల కొనుగోలుకు నిధులు విడుదల చేయాలని అధికారులు పదేపదే లేఖలు రాసినా చంద్రబాబు నిధులు విడుదల చేయలేదన్నారు. దాని వల్ల సకాలంలో విత్తనాలు కొనుగోలు చేయలేకపోయారన్నారు.

చంద్రబాబునాయుడు 2014లో రైతులకు సంబంధించిన 87వేల 612కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి… ఆ తర్వాత దాన్ని 24వేల కోట్లకు కుదించి… చివరకు ఐదేళ్లలో 15వేల కోట్లు మాత్రమే రుణమాపీ చేశారన్నారు. ఈ ఏడాది 84వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అధికారంలోకి రాగానే రైతుల కోసం ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం’ అమలులోకి తెచ్చామని జగన్ వివరించారు.

గతంలో చంద్రబాబు రుణమాఫీపై ఎలా మాటమార్చారు అన్న దానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రదర్శించింది.

విత్తనాల కొనుగోలుకు డబ్బులు విడుదల చేయాలంటూ ఎన్నికలకు ముందు అధికారులు రాసిన లేఖలను కూడా అసెంబ్లీలో స్క్రీన్‌పై ప్రదర్శించారు. వాటిని ప్రదర్శిస్తున్నప్పుడు చంద్రబాబు మౌనంగా చూస్తూ కూర్చున్నారు.

‘వైఎస్‌ఆర్ ఉచిత పంటబీమా పథకం’ కింద 55 లక్షల మంది రైతుల తరపున పంటలకు బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తున్నామన్నారు. పొగాకు ధరలు పడిపోతుంటే సకాలంలో స్పందించి రైతులకు ఆదుకున్నట్టు చెప్పారు. రెండు వేల కోట్ల రూపాయలు ఇన్‌పుట్ సబ్సిడీగా చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్ రద్దు చేశామన్నారు. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు.

ప్రమాదవశాత్తు రైతులు చనిపోతే వారి కుటుంబానికి ఏడు లక్షలు ఇస్తామన్నారు. 2014-19 మధ్య 1513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. కానీ వారిలో కేవలం 391 మందికి మాత్రమే గత ప్రభుత్వం పరిహారం ఇచ్చిందన్నారు. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు 12,500 పెట్టుబడి సాయంగా అందజేస్తామన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాత బకాయిలకు జమ చేసుకోకుండా ఆదేశిస్తామన్నారు.

నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు అందిస్తామన్నారు. వాటిని పరీక్షించేందుకు ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తామన్నారు. చరిత్ర గర్వించేలా గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు మళ్లిస్తామన్నారు.

మంచినీటి ఎద్దడి నివారణ కోసం ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. నిధులను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్న తేడా లేకుండా అందరు ఎమ్మెల్యేలకు నిధులు అందిస్తామన్నారు.