సీఎంను అభినందించేందుకు బాబు నిరాకరణ… వాగ్వాదం

రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరువుపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంచినీటి ఎద్దడి నివారణ కోసం ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు అధికార, ప్రతిపక్షం అన్న సంబంధం లేకుండా కోటి రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

సీఎం ప్రకటన ముగిసిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేచి… గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు వద్దకు వెళ్లి ఎప్పటిలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని కోరామని గుర్తు చేశారు.

కానీ సీఎంగా చంద్రబాబు మాత్రం తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వబోనని చెప్పారని… ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ నిధులు ఇస్తానని ప్రకటించారని… కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని అభినందించాలని పెద్దిరెడ్డి కోరారు.

అయితే ఇందుకు స్పందించిన చంద్రబాబు… ముందు టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది.

నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రిని అభినందించాల్సింది పోయి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని అధికార పార్టీ సభ్యులు ప్రశ్నించారు.