త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం – జేసీ

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీతో తాళి కట్టించుకుంటామని వ్యాఖ్యానించారు. బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని వెల్లడించారు.

ఒక చానల్‌తో మాట్లాడిన ఆయన… బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి ఈసారి తామే బీజేపీతో తాళి కట్టించుకుంటామని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని మోడీ అనుకుంటున్నారని…అలా చేయాలంటే బెస్ట్ ఎకనామిస్ట్ అయిన చంద్రబాబు సలహాలు చాలా అవసరం అన్నారు. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసన్నారు.

బీజేపీ- టీడీపీ బంధం కొత్తేమీ కాదని… తిరిగి సంసారం కొనసాగిస్తామన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ”చీము నెత్తురు ఉందా” అన్న డైలాగ్‌కు చోటు లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.