ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ఓటమికి కారణాలెన్నో

  • సెమీస్ ఓటమితో అభిమానుల తీవ్ర నిరాశ
  • ఓటమి ఆటలో భాగమే అంటూ కొహ్లీ సమర్థన
  • ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓడిన విరాట్ సేన

కర్ణుడు చావుకు కారణాలు కోటి అన్న సామెత..ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సెమీస్ లోనే భారత ఓటమికి సైతం అతికినట్లు సరిపోతుంది.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో చెలరేగి ఆడి, లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్…నాకౌట్ సెమీఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ పేస్ ఎటాక్ ముందు నిలువలేకపోయింది.

లోస్కోరింగ్ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల ఓటమికి పలు రకాల కారణాలున్నాయి.

వరుణుడే తొలి విలన్…..

సెమీస్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడటం, ఒక్కరోజులో ముగియాల్సిన మ్యాచ్ రెండురోజులపాటు సాగటం భారత్ ను దెబ్బతీసింది.

తొలిరోజునే  మ్యాచ్ పూర్తిగా సాగి ఉంటే … భారతజట్టే విజేతగా నిలిచి ఉండేదని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. రిజర్వ్ డే నాడు వాతావరణం మేఘావృతం కావడం, స్వింగ్, ఫాస్ట్ బౌలర్లకు పూర్తిగా అనుకూలించడం కూడా ఓ కారణంగా పరిగణిస్తున్నారు.

భారత టాప్ త్రీ టపటపా…

రౌండ్ రాబిన్ లీగ్ లో టన్నుల కొద్ది పరుగులు సాధించిన భారత టాప్ త్రీ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రాహుల్… ప్రారంభ ఓవర్లలోనే ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది.

అంతేకాదు…కివీ ఓపెనింగ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ , మాట్ హెన్రీ అసాధారణ లైన్ లెంగ్త్ తో బౌల్ చేసి…దెబ్బ మీద దెబ్బ కొట్టి భారత్ ను కోలుకోనివ్వకుండా చేయగలిగారు.

విరాట్ కొహ్లీ సెమీస్ ఫోబియా…

వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డుల మోత మోగించడాన్ని ఓ అలవాటుగా చేసుకొన్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ కావడం కూడా ఓ దురలవాటుగా మారింది.

2011, 2015 ప్రపంచకప్ టోర్నీల సెమీస్ లో ఒక్క పరుగు, 9 పరుగుల స్కోర్లకు అవుటైన కొహ్లీ… ప్రస్తుత ప్రపంచకప్ సెమీఫైనల్లో సైతం… ట్రెంట్ బౌల్ట్ ఇన్ స్వింగర్ కు అడ్డంగా దొరికిపోయాడు. ఒక్క పరుగుకే వెనుదిరిగాడు.

తన కెరియర్ లో విరాట్ కొహ్లీ ఆడిన ఆరు ప్రపంచకప్ సెమీఫైనల్స్ నాకౌట్ మ్యాచ్ ల్లో 12.1 సగటు మాత్రమే సాధించడం చూస్తే… అత్యంత ప్రధానమైన మ్యాచ్ ల్లో కొహ్లీ సత్తా ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు.

న్యూజిలాండ్ సూపర్ ఫీల్డింగ్…

ప్రపంచకప్ సెమీస్ లో భారత ఓటమికి మరో ప్రధానకారణం…న్యూజిలాండ్ ఫీల్డింగ్. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ లను కివీ వికెట్ కీపర్ లాథమ్.. కళ్లు చెదిరే క్యాచ్ లతో పెవీలియన్ దారి పట్టించాడు. దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్ ను నీషమ్ అందుకొన్న తీరుచూసి వావ్ అనుకోక తప్పదు.

భారత్ విజయానికి చేరువగా ఉన్న సమయంలో ..ధోనీని గప్టిల్ రనౌట్ చేయడం మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసింది. భారత్ ను ఫైనల్ చేరకుండా చేయగలిగింది.

చెత్త షాట్లతో భారత్ చిత్తు….

భారత ఓపెనర్ల నుంచి లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల వరకూ..అనవసరపు ఒత్తిడితో చెత్త షాట్లు ఆడి కివీ బౌలర్లకు చేజేతులా వికెట్లు అప్పజెప్పారు.

రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా సంయమనంతో ఆడి కుదురుకొంటున్న సమయంలో చెత్తషాట్లకు వెళ్ళి అవుట్ కావడం కూడా భారత పరాజయానికి.. ఓ కారణంగా నిలిచింది.

మితిమీరిన ప్రయోగాలు…

గత నాలుగేళ్ల కాలంలో నంబర్ ఫోర్ నుంచి నంబర్ ఏడు స్థానాలలో మొత్తం 24 మంది ఆటగాళ్లను ఆడించి…కుదురుగా ఆడిన రాయుడు లాంటి ఆటగాడిని పక్కనపెట్టి మరీ..మితిమీరిన ప్రయోగాలతో భారత్ భారీ మూల్యమే చెల్లించింది. అజింక్యా రహానే కౌంటీ క్రికెట్ కే పరిమితమైతే… అంబటిరాయుడు మాత్రం… విసిగిపోయి… ఏకంగా రిటైర్మెంటే ప్రకటించాడు.

ఆలస్యంగా ఎదురుదాడి…

మహేంద్ర సింగ్ ధోనీ- రవీంద్ర జడేజా 7వ వికెట్ కు రికార్డుస్థాయిలో 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినా…ఆలస్యంగా ఎదురుదాడికి దిగటం కూడా భారత్ ను తీవ్రఒత్తిడిలో పడవేసింది. ఆఖరి మూడు ఓవర్లలో విజయం కోసం 37 పరుగులు చేయాల్సి వచ్చింది.

మితిమీరిన ఆత్మవిశ్వాసం…

న్యూజిలాండ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడంతో పాటు మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం కూడా భారత్ కొంప ముంచింది. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీ వితండవాదంతో తాము ఆడిందే ఆట అన్నట్లుగా ప్రవర్తించడం కూడా భారత్ ను దెబ్బతీసింది.

ఏదిఏమైతేనేం…ప్రపంచకప్ కు ముందు వరకూ చింపేస్తాం…పొడిచేస్తాం అంటూ రెచ్చిపోయిన విరాట్ సేన…సెమీస్ లో బోల్తా కొట్టడం, ఓటమిని గెలుపులా సమర్థించుకోడం ఏమాత్రం సమర్థనీయం కాదు.