అసెంబ్లీలో అరుదైన సన్నివేశం

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అరుదైన సంఘటన జరిగింది. బహుశ సమైక్య ఆంధ్రప్రదేశ్ లోను, విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను కూడా ఇలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు.

ఇంతకి ఆ అరుదైన సంఘటన ఏమిటనుకుంటున్నారా.. ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లేచి నిలుచుని స్పీకర్ కు విజ్ఞప్తి చేయడం. అది కూడా ఒక అంశంపై చర్చ, ప్రభుత్వ వైపు నుంచి సమధానం కూడా వచ్చీ, ఆ చర్చ ముగిసిందని సభలో స్పీకర్‌ ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వమని ముఖ్యమంత్రే కోరడం ఇదే తొలిసారి.

గురువారం నాడు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ లో కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సోదాహరణంగా ప్రకటన చేసారు. రాష్ట్రంలో కరువు పరిస్ధితులు, వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేసారు. ఈ ప్రకటనపై అధికార, ప్రతిపక్ష సభ్యులు దాదాపు నాలుగు గంటల సేపు చర్చించారు. అనంతరం చర్చ ముగిసినట్లుగా స్పీకర్ ప్రకటించారు.

అయితే శుక్రవారం నాడు ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే ముగిసిపోయిన చర్చపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ వాయిదా తీర్మానం చర్చకు ఆమోదించాలంటూ తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. సభ సజావుగా జరగకుండా తెలుగుదేశం సభ్యులు గందరగోళం చేశారు. సభా నియమాలను అనుసరించి ముగిసిన అంశంపై తిరిగి చర్చను కొనసాగించలేమని స్పీకర్ తమ్మినేని సీతారాం పదేపదే ప్రకటించారు.

అయినా తెలుగుదేశం సభ్యులు సభా సంప్రదాయాలను ధిక్కరిస్తూ సభలో గందరగోళం చేశారు. ఆ సమయంలో సభలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కలుగుజేసుకుని ముగిసిపోయిన అంశంపై ప్రతిపక్ష సభ్యులు ఇంకా మాట్లాడతామంటున్నారని, ఇది సంప్రదాయం కాకపోయినా వారు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ముగిసిన అంశంపై తిరిగి మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వమని ముఖ్యమంత్రే కోరడం సభలో ఉన్న సీనియర్ నాయకులకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఆ సమయంలో సభలో ఉన్న చంద్రబాబు సైతం ఒకింత ఆశ్చర్యం, ఉలికిపాటుకు గురయ్యారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే తన ఆనందాన్ని దాచుకోలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వమని కోరగానే స్పీకర్ సీతారాం తన కుడిచేయిని గాలిలో ఊపుతూ ముఖ్యమంత్రి ప్రకటనను కళ్లతోనే అభినందించారు.