ఇంట్లో డబ్బు కట్టలు… కారులో పాసు బుక్కుల కట్టలు…!

ఆ ఇంట్లో కట్టల కట్టల డబ్బు. ఆ ఇంటి యజమాని కారులో పదుల సంఖ్యలో పట్టాదారు పాసు పుస్తకాలు. ఈ రెండింటికి లింక్ ఏమిటనుకుంటున్నారా…!? ఉంది. చాలా పెద్దలింకే ఉంది. రైతు పేరును ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసే అంశంలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ లావణ్య కేసులో తవ్వేకొద్దీ ఆసక్తి కలిగించే అంశాలు బయటపడుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు వీఆర్ఓ అనంతయ్య ఓ రైతు నుంచి ఆన్ లైన్ లో పేరు రిజిస్టర్ చేయడం కోసం లంచం తీసుకుంటూండగా ఏసీబీకి పట్టబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు తహశీల్దార్ లావణ్య ఇంటిపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 93 లక్షల రూపాయలు, 40 తులాల బంగారం దొరికింది.

దీంతో గురువారమంతా ఏసీబీ అధికారులు తహశీల్దార్ లావణ్య ఇళ్లు, కారు, ఇతర ప్రాంతాలలో తనిఖీలు చేశారు. లావణ్య కారులో పదుల సంఖ్యలో రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు దొరకడంతో ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. తహశీల్దార్ లావణ్య తన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారని గుర్తించారు.

లంచం సొమ్మను బ్యాంకుల్లోను, ఇతర మార్గాలలోనూ దాచిపెడితే ఆదాయ పన్ను శాఖకు తెలిసే అవకాశం ఉంటుందనే ఇంట్లో దాచి పెట్టినట్లుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. తహశీల్దార్ లావణ్యకు మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఖాతాల వివరాల కోసం బ్యాంకులను కూడా ఏసీబీ అధికారులు సంప్రదిస్తున్నారు. తన అవినీతి పనుల కోసం తహశీల్దార్ లావణ్య తన ఇంటినే వాడుకోవడం విశేషం. తాను పని చేస్తున్న కార్యాలయం పరిధిలోని రైతులందరూ వివిధ పనుల కోసం నేరుగా తహశీల్దార్ లావణ్య ఇంటికే వచ్చే వారని స్థానికులు చెబుతున్నారు.

ఇక తహశీల్దార్ లావణ్య భర్త వెంకటేశం తెలంగాణ ఎన్ జీవో సంఘం అధ్యక్షుడుగా ఉన్నారు. వారి ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో స్ధానిక పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా వెంకటేశంకు ఏసీబీ అధికారులు ఫోన్ చేశారు. వస్తున్నానంటూ సమాధానం చెప్పిన వెంకటేశం ఆ తర్వాత ఆయన రాకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తహశీల్దార్ లావణ్య, వీఆర్ఓ అనంతయ్యలపై ఏసీబీ అధికారులు వివిధ సెక్షల కింద కేసులు పెట్టి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి 14 రోజు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దరిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.