వీళ్ల జాతకాలు తేలేది ఈరోజే

వస్తున్నవి చిన్న సినిమాలే. కానీ అవి జాతకాలు తేల్చే సినిమాలు. వాళ్ల భవిష్యత్తును డిసైడ్ చేసే సినిమాలు. అవును.. ఈరోజు థియేటర్లలోకి వస్తున్న 2 సినిమాలు ముగ్గురి జాతకాల్ని తేల్చబోతున్నాయి. ఆ రెండు సినిమాలేంటో చూద్దాం.

ముందుగా ఆనంద్ దేవరకొండ విషయానికొద్దాం. విజయ్ దేవరకొండ తమ్ముడు ఇతడు. ఈరోజు థియేటర్లలోకి వస్తున్న దొరసాని సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ కెరీర్ కోసం అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి మరీ వచ్చాడు. ఈ సినిమా క్లిక్ అయితే ఆనంద్ దేవరకొండకు క్రేజ్ వస్తుంది. లేదంటే అంతే సంగతులు.

ఇదే సినిమా హీరోయిన్ శివాత్మికకు కూడా పెద్ద పరీక్షగా మారింది. రాజశేఖర్ కూతురుగా ఉన్న ఇమేజ్ ను హీరోయిన్ గా మార్చుకోవాలంటే దొరసాని సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. ఇప్పటికే రాజశేఖర్ పెద్దకూతురు నటించిన 2స్టేట్స్ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు చిన్నకూతురు సినిమా కూడా ఫ్లాప్ అయితే ఆ కుటుంబానికి పెద్ద దెబ్బ.

వీళ్లతో పాటు సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే సినిమా కూడా ఈరోజు థియేటర్లలోకి వస్తోంది. సందీప్ సినిమాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ సినిమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాత కూడా ఇతడే. నిను వీడని నీడను నేనే సినిమా ఫలితం తేడా కొడితే హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా సందీప్ కు భారీ నష్టం. సో.. ఈ ముగ్గురి జాతకాలు మరికొన్ని గంటల్లో తేలిపోబోతున్నాయి.