శర్వానంద్ సినిమా మరోసారి వాయిదా

ఏ ముహూర్తాన ప్రారంభించాడో కానీ శర్వానంద్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ సినిమా తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. లెక్కప్రకారం ఈ సినిమాను వచ్చేనెల 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడా డేట్ నుంచి రణరంగం సినిమా తప్పుకుంది.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికాలేదు. మరీ ముఖ్యంగా డీఐ, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉన్నాయట. మరో 10 రోజుల్లో ఆ పనులు పూర్తయిపోతాయని భావించి, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కానీ ఆ సమయం సరిపోదని తాజాగా నిర్ణయించారు. అందుకే సినిమాను ఆగస్ట్ 2 తేదీ నుంచి తప్పించారు.

మరోవైపు సినిమాకు శర్వానంద్ కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్టు ఇన్ సైడ్ టాక్. ఈ మార్పులు, చేర్పులు పూర్తిచేయడానికి కూడా మరింత సమయం పడుతుందట. ఈ కారణాల వల్ల రణరంగం సినిమా రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఆగస్ట్ 2న గుణ 369, రాక్షసుడు సినిమాలతో పాటు రణరంగం షెడ్యూల్ అయింది. ఈ 3 సినిమాల మధ్య మంచి పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇప్పుడు శర్వానంద్ తప్పుకోవడంతో.. కార్తికేయ, బెల్లంకొండ మధ్య ద్విముఖ పోటీ ఫిక్స్ అయింది.