జైలు భోజనం బాగుందని…. మళ్లీ దొంగతనం చేస్తూ కావాలని దొరికిపోయాడు..!

ఎవరైనా ఎందుకు దొంగతనం చేస్తారు..? డబ్బు కోసమో.. సొత్తు కోసమో చేస్తారు. కాని ఈ దొంగ మాత్రం చాలా వింత దొంగ. జైలులో భోజనం బాగుందని.. అక్కడి ఫ్రెండ్స్, వాతావరణం బాగుందని.. తిరిగి జైలుకు వెళ్లాలంటే దొంగతనం చేస్తేనే వెళ్లగలనని భావించి చోరీలు చేస్తున్నాడు.

తమిళనాడుకు చెందిన గణన ప్రకాశం ఈ ఏడాది మార్చిలో ఒక దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. 52 ఏండ్ల ఈ దొంగ కొన్ని నెలలు జైలు జీవితం గడిపి తిరిగి విడుదలయ్యాడు. కాని బయటకు వచ్చాక తినడానికి తిండి లేక, ఆదరించేవాళ్లు లేక చాలా బాధపడ్డాడు. జైలు జీవితమే బాగుందని.. అక్కడ మూడు పూటలా చక్కగా భోజనం పెడుతున్నారు కదా అని అనుకున్నాడు. బయట అసలు తినడానికి తిండి దొరకక పోవడంతో తిరిగి జైలుకు వెళ్లాలని భావించాడు.

జైలుకు వెళ్లాలని అనుకొని వెంటనే ఒక బైకును దొంగతనం చేశాడు. ఆ సమయంలో తన మొఖం సీసీ కెమేరాకు చిక్కేలా చూసుకున్నాడు. బైక్ దొంగతనం చేసి వెళ్తున్న సమయంలో బైకులో పెట్రోల్ అయిపోయింది. వెంటనే బైకును పక్కకు ఆపి వేరే దాంట్లో నుంచి పెట్రోల్ తీస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఎందుకు పెట్రోల్ దొంగతనం చేస్తున్నావని అడిగారు. వెంటనే దానికి ప్రకాశం.. నేను పెట్రోలే కాదు ఆ బైకును కూడా దొంగతనం చేశానని చెప్పాడు. ఇతనేంటి అడక్కుండానే అన్నీ చెబుతున్నాడని పోలీసులు పూర్తి సమాచారం సేకరించారు.

తనకు ఎవరూ లేరనీ.. బయట ఆదరించే మనుషులు కూడా లేరని.. తిండికి ఇబ్బందులు పడుతున్నానని.. అదే జైల్లో ఉంటే మూడు పూటలా తిండి దొరుకుతుందని బదులిచ్చాడు. మళ్లీ జైలుకు పోవడానికే ఈ దొంగతనం చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. దొంగతనం కేసు నమోదు చేసి అతడిని జైలుకు పంపారు.