Telugu Global
CRIME

మావోయిస్టుల చేతిలో మాజీ ఎంపీటీసీ హతం

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. శ్రీనివాసరావు ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో హత్య చేసినట్లుగా మావోయిస్టులు ప్రకటించారు. భద్రాచలం జిల్లా కొత్తగూడానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస రావును ఈ నెల 8 వ తేదీన మావోయిస్టులు కిడ్నాప్ చేసారు. ఆ రోజు నుంచి శ్రీనివాసరావు కోసం పోలీసులతో పాటు గ్రామస్థులు కూడా సరిహద్దు అటవీ ప్రాంతంలో వెతికారు. శుక్రవారం సాయంత్రం […]

మావోయిస్టుల చేతిలో మాజీ ఎంపీటీసీ హతం
X

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. శ్రీనివాసరావు ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో హత్య చేసినట్లుగా మావోయిస్టులు ప్రకటించారు.

భద్రాచలం జిల్లా కొత్తగూడానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస రావును ఈ నెల 8 వ తేదీన మావోయిస్టులు కిడ్నాప్ చేసారు. ఆ రోజు నుంచి శ్రీనివాసరావు కోసం పోలీసులతో పాటు గ్రామస్థులు కూడా సరిహద్దు అటవీ ప్రాంతంలో వెతికారు.

శుక్రవారం సాయంత్రం తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని చర్ల మండలం ఎర్రంపాడు దగ్గర అటవీ ప్రాంతంలో శ్రీనివాస రావు మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పక్కన మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు.

శ్రీనివాస రావు పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నారని, తాము ఎన్నిసార్లు హెచ్చరించినా వినకపోవడంతో చంపాల్సి వచ్చిందని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. శారద పేరుతో విడుదల చేసిన ఆ లేఖలో శ్రీనివాసరావు తాను స్వయంగా ఇన్ ఫార్మర్ కావడమే కాకుండా అటవీ ప్రాంత గ్రామాలలో మరింత మంది ఇన్ ఫార్మర్లను తయారు చేస్తున్నాడని ఆరోపించారు.

ఇంటిలిజెన్స్ అధికారులతో చేతులు కలిపి మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీలకు చెందిన 70 ఎకరాలను పోలీసుల సాయంతో శ్రీనివాస రావు ఆక్రమించుకున్నాడని ఆ లేఖలో మావోయిస్టులు ఆరోపించారు.

ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టు పార్టీని లేకుండా చేసేందుకు పోలీసుల సాయంతో శ్రీనివాస రావు ప్రయత్నిస్తున్నాడని, తమ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పోలీసులకు అందజేస్తున్నందుకే ఆయనను చంపినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ సంఘటనతో కొత్తగూడెం, ములుగు మండలాలకు చెందిన పోలీసులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో అప్రత్తమైన పోలీసులు అటవీ ప్రాంతంలో నిఘా పెంచారు. ప్రజా ప్రతినిధులు తమకు సమాచారం ఇవ్వకుండా అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని హెచ్చరించినట్లు సమాచారం.

First Published:  12 July 2019 9:20 PM GMT
Next Story