మీకు 15 వందలు కావాలా? 15 వేలు కావాలా?

మీకు పదిహేను వందలు కావాలా? పదిహేను వేలు కావాలా? అని ఇంటర్‌ మీడియట్‌ విద్యార్ధులను ప్రశ్నిస్తోంది జగన్‌ ప్రభుత్వం. ఈ ప్రశ్న చూస్తే…. ఇదేం ప్రశ్న? ఎవరైనా 15 వేలు కోరుకుంటారు కదా! అనిపిస్తుంది.

అయితే తెలుగుదేశం విద్యార్ధి విభాగం…. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) మాత్రం ఇంటర్‌మీడియట్‌ విద్యార్ధులకు పదిహేను వేలు వద్దు… పదిహేను వందలే కావాలని … ఈ నెల పదిహేనవ తేదీ నుంచి బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో కాలేజీలలో ధర్నాలు నిర్వహించడానికి, ఛలో గుంటూరు కార్యక్రమానికి సిద్ధమవుతోంది టీడీపీ.

విషయంలోకి వస్తే…..

చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ఆరునెలల ముందు హడావిడి చేసి అనేక స్కీమ్‌లు ప్రకటించినట్టు ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల ఇంటర్‌మీడియట్‌ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రకటించాడు. అది 2018 జూలై నుంచి ప్రారంభమై కొద్ది నెలలు నడిచింది. ఒక్కో విద్యార్ధికి భోజనం కోసం చంద్రబాబు ప్రభుత్వం రోజుకు 5 రూపాయలా 50 పైసలు కేటాయించింది.

వారంలో కొన్నిరోజులు కోడి గుడ్డు కూడా భోజనంలో పెట్టాలని, ఆరోజుల్లో మరో నాలుగు రూపాయలు అదనంగా కేటాయించింది. సాధారణంగా ఏడాదిలో 180 వర్కింగ్‌ డేస్‌ ఉంటాయి. అంటే ఒక్కో విద్యార్ధి మీద చంద్రబాబు ప్రభుత్వం 1300 నుంచి మహా అయితే 1500 రూపాయలు ఖర్చుపెట్టింది.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ‘మిడ్‌ డే మీల్ స్కీమ్‌’ లో సాధకబాధకాలు చూశాక దానికి బదులుగా ఒక్కో విద్యార్ధి మీద 15 వందల రూపాయలు ఖర్చుపెట్టేదానికన్నా…. ఒక్కో విద్యార్ధికి 15 వేల రూపాయలు నగదుగా ఇవ్వడానికి నిర్ణయించుకుంది.

ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం విద్యార్ధి విభాగం వ్యతిరేకిస్తూ జూలై 15 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్ధి ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

జూలై 15న స్థానికంగా ధర్నాలు నిర్వహించడానికి, జూలై 17న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయడానికి, జూలై 19న ఛలో గుంటూరు కార్యక్రమానికి టీడీపీ విద్యార్ధి విభాగం పిలుపునిచ్చింది. టీడీపీ విద్యార్ధి విభాగం ఇచ్చిన ఈ పిలుపు చూసి ఇంటర్‌ మీడియట్‌ విద్యార్ధులు ఆశ్చర్యపోతున్నారు.