మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మహేష్ ఓ సినిమా చేస్తున్నాడంటే చాలు.. టైటిల్ ఎప్పుడొస్తుందా, ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. కొన్ని సార్లు ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మహేష్ పై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరుగుతుంటుంది. కానీ మహేష్ అప్ కమింగ్ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ ఇలాంటి బెంగ పెట్టుకోనక్కర్లేదు. హ్యాపీగా రెగ్యులర్ అప్ డేట్స్ అందుకోవచ్చు. అంతేకాదు, స్టిల్స్ కూడా.

అవును.. మహేష్ కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక ముహూర్తం పెట్టి స్టిల్స్ విడుదల చేసే కార్యక్రమాలు మానుకున్నారు. షూటింగ్ ప్రారంభమైనప్పట్నుంచి దశలవారీగా స్టిల్స్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహేష్ మిలట్రీ లుక్ లో ఉన్న ఫొటోను విడుదల చేశారు. ఇలా నెలకు ఒక స్టిల్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. అదే వరుసలో ఫస్ట్ లుక్ కూడా వచ్చేస్తుందన్నమాట. ఇక టైటిల్ అంటారా.. మూవీ లాంఛింగ్ రోజునే టైటిల్ ను, లోగో డిజైన్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం నాగార్జన కూడా మన్మధుడు-2 సినిమా విషయంలో ఈ పద్ధతి ఫాలో అవుతున్నాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి స్టిల్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. సినిమా ప్రమోషన్ కు అది బాగా ప్లస్ అయింది. ఇప్పుడదే పద్ధతిని మహేష్ కొత్త సినిమాకు కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు.

ఈ ట్రెండ్ బాలీవుడ్ లో చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడిది టాలీవుడ్ కు కూడా వచ్చిందన్నమాట. ఇలాగైనా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.