రేణుదేశాయ్ రీఎంట్రీ షురూ

దర్శకురాలిగా మరాఠీలో ప్రయత్నించి ఫెయిల్ అయింది. రచయితగా ప్రయత్నించింది. ఫలితం అంతంతమాత్రమే. టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందించట్లేదు. ఇక లాభం లేదని భావించిన రేణుదేశాయ్ మరోసారి ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయింది. కెమెరా ముందుకు రాబోతోంది. సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇస్తోంది.

త్వరలోనే వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు బయోపిక్ ను టైగర్ నాగేశ్వరావు పేరిట చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్ ను సంప్రదించారు. అందులో నటించడానికి ఆమె అంగీకరించింది. ఈ విషయాన్ని మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా కన్ ఫర్మ్ చేశాడు.

తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా మారింది రేణుదేశాయ్. అదే టైమ్ లో వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అందుకే తెలుగులో ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. తర్వాత జానీ అనే సినిమా మాత్రమే చేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు రేణుదేశాయ్ వెండితెరపైకి వస్తోంది. రీఎంట్రీ ఆమెకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.