వింబుల్డన్ లో నేడే పురుషుల టైటిల్ ఫైట్

  • నువ్వానేనా అంటున్న ఫెదరర్ ,జోకోవిచ్

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ లో టైటిల్ పోరుకు రంగం సిద్ధమయ్యింది. ఆల్-ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో జరిగే సూపర్ సండే ఫైట్ లో టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, రెండో సీడ్ రోజర్ ఫెదరర్ ఢీ కొనబోతున్నారు.

37 ఏళ్ల వయసులో టైటిల్ వేట…

గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ 37 ఏళ్ల లేటు వయసులో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు. రెండోసీడ్ గా బరిలోనిలిచిన ఫెదరర్.. తన కెరియర్ లో 31వసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో పోటీకి దిగుతున్నాడు.

తొలి సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నడాల్ ను నాలుగుసెట్ల పోరులో చిత్తు చేయడం ద్వారా…12వసారి వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టాడు.

ఇప్పటికే ఎనిమిదిసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన ఫెదరర్.. తొమ్మిదోసారి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఫెదరర్ పై జోకోదే పైచేయి…

మరోవైపు…టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ తన కెరియర్ లో .. ఆరోసారి వింబుల్డన్ టైటిల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు. 25వసారి ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడుతున్న జోకోవిచ్ కు…ఆరుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన రికార్డు సైతం ఉంది.

అంతేకాదు.. రోజర్ ఫెదరర్ ప్రత్యర్థిగా జోకోవిచ్ దే పైచేయిగా ఉంది. ఓవరాల్ గా జోకో 25-22 విజయాల రికార్డుతో నిలిచాడు. వింబుల్డన్ ఫైనల్స్ లో సైతం ఫెదరర్ పై జోకోవిచ్ కు 2-1 విజయాల రికార్డు ఉంది.

ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గితే…జోకోవిచ్ 15 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలతో నడాల్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆదివారం జరిగే ఫైనల్లో నెగ్గిన ఆటగాడికి వింబుల్డన్ ట్రోఫీతో పాటు 20 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది.