Telugu Global
NEWS

ప్రపంచకప్ లో నేడే టైటిల్ ఫైట్

తొలి టైటిల్ కోసం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమరం సరికొత్త విశ్వవిజేత కోసం కౌంట్ డౌన్ ప్రపంచ క్రికెట్ అభిమానులను గత ఆరువారాలుగా అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్ సమరం తుదిఅంకానికి చేరింది. నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త చాంపియన్ ఆవిష్కరణకు…లండన్ లోని క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అసాధారణ సమరం… ప్రపంచకప్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్నా టైటిల్ కు చేరువగా వచ్చి దూరమైన జట్లుగా ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, 3వ […]

ప్రపంచకప్ లో నేడే టైటిల్ ఫైట్
X
  • తొలి టైటిల్ కోసం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమరం
  • సరికొత్త విశ్వవిజేత కోసం కౌంట్ డౌన్

ప్రపంచ క్రికెట్ అభిమానులను గత ఆరువారాలుగా అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్ సమరం తుదిఅంకానికి చేరింది. నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త చాంపియన్ ఆవిష్కరణకు…లండన్ లోని క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

అసాధారణ సమరం…

ప్రపంచకప్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్నా టైటిల్ కు చేరువగా వచ్చి దూరమైన జట్లుగా ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, 3వ ర్యాంకర్ న్యూజిలాండ్ కు రికార్డు ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ తో సహా 12 టోర్నీలలో ఎనిమిదిసార్లు సెమీఫైనల్స్, నాలుగుసార్లు ఫైనల్స్ చేరినా ఒక్కసారి విజేతగా నిలువలేకపోయిన ఇంగ్లండ్…ప్రస్తుత 2019 ప్రపంచకప్ ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్..ఎటాకింగ్ బ్రాండ్ క్రికెట్ తో టైటిల్ కు గురిపెట్టింది.

పవర్ ఫుల్ బ్యాటింగ్…పదునైన బౌలింగ్..

బెయిర్ స్టో, జేసన్ రాయ్, జో రూట్, వోయిన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ లాంటి వీరబాదుడు ఆటగాళ్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

అంతేకాదు…జోఫ్రా ఆర్చర్ , క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, ప్లంకెట్, మార్క్ వుడ్ లాంటి సూపర్ బౌలర్లతో బౌలింగ్ ఎటాక్ సైతం ఇంగ్లండ్ ప్రధాన అస్త్రంగా ఉంది.

ఓపెనింగ్ జోడీ ఇచ్చే ఆరంభం పైనే ఇంగ్లండ్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

పోరాటానికి మరో పీరు కీవీస్…

గత ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొన్న న్యూజిలాండ్…లోస్కోరింగ్ సెమీస్ సమరంలో భారత్ ను కంగు తినిపించడం ద్వారా వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగు పెట్టింది. టైటిల్ సమరంలో అండర్ డాగ్ గా పోటీకి దిగుతోంది.

కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, మాజీ కెప్టెన్ రోజ్ టేలర్ లపైనే పూర్తి గా ఆధారపడిన న్యూజిలాండ్ కు…బౌల్ట్, నీషమ్ ఫెర్గూసన్,మాట్ హెన్రీ, సాంట్నర్ లతో కూడిన పదునైన బౌలింగ్ ఎటాక్, కళ్లు చెదిరే ఫీల్డింగ్ ఆయుధాలుగా ఉన్నాయి. ఇంగ్లండ్ టాపార్డర్ కు…కివీ బౌలింగ్ ఎటాక్ కు రసపట్టుగా పోరు జరుగనుంది.

లార్డ్స్ లో టాసే కీలకం…

బ్యాటింగ్ కు అనువుగా ఉండే లార్డ్స్ స్టేడియం వికెట్ పైన జరిగే ఈ టైటిల్ సమరంలో టాస్ నెగ్గినజట్టుకే విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొని 300 పరుగుల స్కోరుకు పైగా సాధించి…ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసే వ్యూహాన్ని అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది.

గత 11 ప్రపంచకప్ టోర్నీల ఫైనల్స్ లో ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న జట్లే ఏడుసార్లు విజేతగా నిలవడం విశేషం.

న్యూజిలాండ్ 5-4 రికార్డు..

ప్రపంచకప్ లో ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే న్యూజిలాండ్ దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు తలపడితే..ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ 5 విజయాలు సాధిస్తే…కివీస్ పై ఇంగ్లండ్ కు నాలుగు విజయాలు మాత్రమే ఉన్నాయి.
ఈ ఫైనల్లో విజేతగా ఏజట్టు నిలిచినా అది సరికొత్త చరిత్రే అవుతుంది. చాంపియన్ గా నిలిచిన జట్టుకు ప్రపంచకప్ తో పాటు..28 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సైతం అందచేస్తారు.

First Published:  14 July 2019 1:10 AM GMT
Next Story