8 నిమిషాల సీన్ కోసం రూ.70 కోట్లు ఖర్చు

సాహో సినిమాకు సంబంధించి కేవలం ఒకే ఒక్క షెడ్యూల్ కోసం 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో ఆ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేశారు.

ముంబయితో పాటు హాలీవుడ్ కు చెందిన ఎంతోమంది టెక్నీషియన్స్ ఆ షెడ్యూల్ లో పాల్గొన్నారు. నెల రోజులకు పైగా షూట్ చేసిన ఆ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో కేవలం 8 నిమిషాలు మాత్రమే.

అవును.. సాహో సినిమాలో 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సన్నివేశాలు కేవలం 8 నిమిషాలు మాత్రమే అలరించబోతున్నాయి. నిజానికి ఈ ఎపిసోడ్ తోనే సెకెండాఫ్ లో చాలాభాగం నడిపిస్తారని చాలామంది ఊహించారు. కనీసం ఓ 20 నిమిషాలైనా ఈ ఛేజింగ్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అనుకున్నారు. కానీ సినిమాలో అది కేవలం 8 నిమిషాలకే పరిమితమైంది.

అంతేకాదు.. ఆ 8 నిమిషాల వెర్షన్ కూడా ఇంకా పూర్తిగా సిద్ధమవ్వలేదు. ఇంకా సగం గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉందట. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సరిగ్గా మరో నెల రోజుల్లో (ఆగస్ట్ 15న) థియేటర్లలోకి రాబోతోంది.