Telugu Global
NEWS

రిటైర్మెంట్ పై ధోనీ డైలమా

ప్రపంచకప్ తో ముగిసిన ధోనీ వన్డే ఇన్నింగ్స్ 350 వన్డేలలో 10వేల పరుగుల ధోనీ ప్రపంచకప్ తో స్వదేశానికి తిరిగిరావాలనుకొన్న భారతజట్టు సెమీస్ లోనే విఫలమయ్యింది. ప్రపంచకప్ విజయంతో రిటైర్ కావాలని ఆశపడిన భారత ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఆశ ఆడియాసగా మిగిలింది. మరి.. 38 ఏళ్ల ధోనీ దారి ఎటు. హుందాగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేక విమర్శలు ఎదుర్కొంటూనే మరికొంతకాలం కొనసాగుతాడా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్ కు కెప్టెన్ […]

రిటైర్మెంట్ పై ధోనీ డైలమా
X
  • ప్రపంచకప్ తో ముగిసిన ధోనీ వన్డే ఇన్నింగ్స్
  • 350 వన్డేలలో 10వేల పరుగుల ధోనీ

ప్రపంచకప్ తో స్వదేశానికి తిరిగిరావాలనుకొన్న భారతజట్టు సెమీస్ లోనే విఫలమయ్యింది. ప్రపంచకప్ విజయంతో రిటైర్ కావాలని ఆశపడిన భారత ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఆశ ఆడియాసగా మిగిలింది. మరి.. 38 ఏళ్ల ధోనీ దారి ఎటు. హుందాగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేక విమర్శలు ఎదుర్కొంటూనే మరికొంతకాలం కొనసాగుతాడా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భారత్ కు కెప్టెన్ గా రెండు రకాల ప్రపంచకప్ లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ..ఓ ఆటగాడిగా ప్రపంచకప్ సాధించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు చిరస్మరణీయమైన సేవలు అందించిన ధోనీ తన కెరియర్ ఆఖరి అంకంలో విమర్శకులకు లక్ష్యంగా మారాడు.

దనాధన్ పోయే…

ధోనీ అనగానే దనాధన్ బ్యాటింగ్ మాత్రమే అనుకోనే రోజులు పోయాయి. ధోనీ అంటే జట్టు అవసరాలకు అనుగుణంగా ఆచితూచి ఆడే అనుభవజ్ఞుడైన ఆటగాడుగా మారిపోయాడు. ధోనీ ఆటతీరులో మార్పును అభిమానులు ఆమోదించలేక విమర్శలకు దిగుతున్నారు.

ఏడాది ఏడాదికీ పడిపోతున్న స్ట్ర్రయిక్ రేట్…పసలేని బ్యాటింగ్ తో ధోనీ …భారత బ్యాటింగ్ ఆర్డర్ కే అలంకరణగా మారాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. భారత క్రికెట్ కు సంవత్సరాల తరబడి అసాధారణ సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోనీలో మహిమ తగ్గిందని, ధోనీ సాధించాల్సింది కూడా ఇక ఏమీలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుత ధోనీ బ్యాటింగ్ లో నాటి దూకుడు….నటరాజ భంగిమలో కొట్టే షాట్లు..తన ట్రేడ్ మార్క్ …హెలీకాప్టర్ షాట్లు .. మచ్చుకైనా కనిపించడం లేదు. క్రీజులో నిలదొక్కుకోడానికి…నాన్ స్ట్రయికర్ కు అండగా నిలవటానికీ మాత్రమే ప్రాధాన్యమిస్తున్నట్లుగా ధోనీ ఆటతీరు కనిపిస్తోంది. ఆత్మరక్షణ ధోరణితోనే ఆడుతున్న ధోనీని చూసి…ఏంటీ ఇలా ఆడుతున్నాడంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

గతంలో…మాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం…తన కెరియర్ చివరి భాగంలో ఇదే తరహా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి ధోనీకి సైతం ఎదురయ్యింది. వయసు పెరిగే కొద్దీ సహజసిద్ధమైన దూకుడు తగ్గి.. పరిస్థితులకు తగ్గట్టుగా… ఆచితూచి ఆడే ధోరణి వస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. దానికి సచిన్ మాత్రమే కాదు…ధోనీ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

దటీజ్ జార్ఖండ్ డైనమైట్..

జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ….తన ఆటకు దూకుడు జోడించి ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన మొనగాడు.
భారీషాట్లు…గొప్ప స్ట్రయిక్ రేట్ తో …మ్యాచ్ ను విజయవంతంగా ముగించడంలో తనకుతానే సాటిగా నిలిచిన ఒకే ఒక్కడు.

అంతేకాదు…భారత్ కు టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ తో పాటు…టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, ఐసీసీ మినీ ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకొన్నాడు. వన్డే క్రికెట్ తో పాటు…ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో సైతం….దూకుడుగా ఆడుతూ పరుగులు వెల్లువెత్తించిన వీరబాదుడు బ్యాట్స్ మన్.

అయితే…ఇదంతా అందమైన గతం. టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత…… కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రిల అండదండలతో భారతజట్టులో కొనసాగుతూ వస్తున్న ధోనీ …2019 ప్రపంచకప్ వరకూ నెట్టకు రాగలిగాడు. ప్రపంచకప్ లో తన ఆఖరి ఇన్నింగ్స్ లో సైతం ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించినా…జట్టుకు ఫైనల్స్ బెర్త్ అందించలేకపోయాడు.

38 ఏళ్ల వయసులో….స్థాయికి తగ్గట్టుగా స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేకపోతున్న ధోనీ..2019 ప్రపంచకప్ తో రిటైర్ కాగలడని అందరూ భావించారు. అయితే ధోనీ మాత్రం క్రికెట్ విరమణపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు.

అరుదైన రికార్డుల ధోనీ…

2004లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం చేసిన నాటినుంచి… ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్ వరకూ…మొత్తం 350 మ్యాచ్ లు ఆడిన ధోనీ మొత్తం 10వేల 773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 87.56 స్ట్రయిక్ రేట్ సైతం నమోదు చేశాడు.

ఇక..మొత్తం 98 టీ-20 మ్యాచ్ ల్లో 126.13 స్ట్ర్రయిక్ రేట్ తో 1617 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్లో మ్యాచ్ ను గొప్పగా ముగించే ఆటగాళ్లకే ఆటగాడిగా గుర్తింపు పొందిన ధోనీ..350 వన్డేలు ఆడిన భారత రెండో క్రికెటర్ గా నిలిచాడు. వికెట్ కీపర్ గా
321 క్యాచ్ లు, 123 స్టంపింగ్స్ తో ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్ ,బ్యాట్స్ మన్ గా రికార్డుల్లో చేరాడు.

ఏదిఏమైనా…వికెట్ కీపర్ గా స్థాయికి మించి రాణించిన ధోనీ …తన అపార అనుభవంతో గత కొద్ది సంవత్సరాలుగా జట్టుకు
కొండంత అండగా నిలుస్తూ వచ్చాడు.

ఎవరు ఏమన్నా…భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలు అమూల్యం, అపురూపం. ధోనీ లేని భారత క్రికెట్ ను ఊహించడం అసాధ్యం.

ధోనీ లాంటి అసాధారణ ఆటగాడు విమర్శకులకు పని చెప్పకుండా తనకు ఇష్టమైన విధంగా సగౌరవంగా రిటైర్ కావాలని కోరుకొందాం.

First Published:  16 July 2019 4:10 AM GMT
Next Story