బోయపాటిని ఆదుకున్న అల్లు అరవింద్

ఎప్పుడో 6 నెలల కిందట విడుదలైంది వినయ విధేయ రామ సినిమా. మళ్లీ ఇప్పటివరకు తన కొత్త సినిమా ప్రకటించలేదు బోయపాటి. ఆయన ప్రకటించలేదు అనేకంటే, అతడికి ఏ హీరో ఛాన్స్ ఇవ్వలేదనడం కరెక్ట్. ఇంకా చెప్పాలంటే బాలయ్య లాంటి హీరో కూడా బోయపాటిని దగ్గరకు రానీయలేదు. వీళ్లిద్దరి మధ్య అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కూడా.

అలా 6 నెలలుగా ఖాళీగా ఉన్న బోయపాటికి ఎట్టకేలకు ఓ ఛాన్స్ వచ్చింది. బోయపాటి నెక్ట్స్ సినిమా ఏంటనే అంశంపై ఓ క్లారిటీ వచ్చింది. అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించాడు. గుణ 369 సినిమా ట్రయిలర్ లాంఛ్ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అరవింద్, సరైనోడు తర్వాత మరోసారి బోయపాటి తో కలిసి పనిచేయబోతున్నట్టు ప్రకటించాడు.

అంతా బాగానే ఉంది కానీ గీతాఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కాస్త మార్చి, గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే సాయిధరమ్ తేజ్ ను హీరోగా అనుకుంటున్నారు. మరోవైపు హీరో కార్తికేయ కూడా లైన్లో ఉన్నాడు. డైరక్టర్ అయితే ఫిక్స్ అయ్యాడు, హీరో ఎవరనేది త్వరలోనే తేలుతుంది.