కోరని కోరికలు కూడా తీర్చే దేవుడు జగన్‌- జనసేన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. బడ్జెట్‌పై మాట్లాడిన వరప్రసాద్‌… బడ్జెట్‌ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు సంక్షేమం, అభివృద్ధే కనిపిస్తోందన్నారు. చాలా పారదర్శకంగా బడ్జెట్‌ను సిద్ధం చేశారన్నారు.

అధికార పార్టీ ఏం చేసినా దాన్ని వ్యతిరేకించమని తనకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చెప్పలేదన్నారు. మంచి చేస్తే అభినందించాల్సిందిగా పవన్ కల్యాణ్ చెప్పారన్నారు.

బడ్జెట్‌ను తాము పూర్తిగా సమర్ధిస్తున్నట్టు ప్రకటించారు. 28వేల కోట్లు వ్యవసాయానికి కేటాయించడం బట్టి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్న విషయం అర్థమవుతోందన్నారు. వ్యవసాయం దండగా అనే స్థాయి నుంచి వ్యవసాయం పండుగ అనే స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందన్నారు.

మత్స్యకారులకు కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ అయితే…. కోరని కోరికలు కూడా తీర్చే దేవుడు వైఎస్ జగన్‌ అని మత్స్యకారులు కీర్తిస్తున్నారని జనసేన ఎమ్మెల్యే చెప్పారు.

జగన్‌ వస్తే తమకు మంచి జరుగుతుందని ప్రజలంతా ఎదురు చూశారన్నారు. గతంలో నామినేటెడ్ పదవులన్నీ అగ్రవర్ణాల వారు తీసుకునే వారని… కానీ ఇప్పుడు వాటిలో 50 శాతం ఎస్సీఎస్టీ, బీసీలకు ప్రత్యేకంగా కేటాయించడం గొప్పవిషయమన్నారు.