ఈ వీకెండ్ 4 సినిమాలు

ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో అందరి దృష్టి పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాపైనే ఉంది. కానీ దాంతో పాటు మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ముందుగా ఇస్మార్ట్ శంకర్ గురించే మాట్లాడుకుందాం. పూరి సినిమాలు ఈమధ్య కాలంలో ఫెయిల్ అవుతున్నప్పటికీ, ఇస్మార్ట్ శంకర్ మాత్రం మంచి బిజినెస్ చేసింది.

ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా, నభా-నిధి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ కావడం ఇస్మార్ట్ శంకర్ కు ప్లస్ అయింది. పైగా రీసెంట్ గా రిలీజ్ చేసిన రెండో ట్రయిలర్ హిట్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ తో పాటు 3 డబ్బింగ్ సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో చెప్పుకోదగ్గ సినిమా ‘ఆమె’. అమలాపాల్ లీడ్ రోల్ పోషించిన ‘అడై’ అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఇది కాస్త వార్తల్లో నలగడానికి ఓ కారణం ఉంది. ఇందులో అమలాపాల్ నగ్నంగా నటించింది. ప్రమోషన్ లో భాగంగా పోస్టర్లతో పాటు టీజర్ లో కూడా ఆ నగ్నత్వాన్నే చూపించారు. అందుకే ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు విక్రమ్ నటించిన ‘మిస్టర్ కేకే’ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. కంప్లీట్ యాక్షన్ సినిమా ఇది. రాజేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ ఓ కీలక పాత్ర పోషించింది.

వీటితో పాటు డిస్నీ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ యానిమేషన్ మూవీ లయన్ కింగ్ కూడా శుక్రవారమే ధియేటర్లలోకి వస్తోంది. నాని, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం లాంటి ప్రముఖులు ఈ సినిమాలో జంతువుల పాత్రలకు డబ్బింగ్ చెప్పడం విశేషం.