ఉగాది నాటికి అందరికీ ఇళ్లు – “స్పందన” సమీక్షలో సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమాన్ని అధికారులెవరు ఆషామాషీగా తీసుకోరాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం జగన్ చెప్పారు.

మంగళవారం నాడు శాసనసభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని పేదవారు ఉండకూడదని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను కోరారు.

గ్రామాలలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, వినతులను కలెక్టర్లు పరిశీలించాలని, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న వినతులలో 80 శాతం వరకు పింఛన్ల పంపిణీ, ఇళ్లు మంజూరు, పౌరసరఫరాల శాఖకు సంబంధించిన విజ్ఞప్తులే ఎక్కువగా వస్తున్నాయని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

దీనికి స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ లు నేరుగా మాట్లాడాలని, స్పందనలో వచ్చిన విజ్ఞప్తులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారో.. లేదో తెలుసుకోవాలని చెప్పారు.

విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ప్రబలుతున్న మలేరియా కేసులపై ఆయా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ చూపించాలని, జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా ఇసుక పాలసీని తీసుకు వచ్చినందున ఇసుక లభ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని, ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్రంలో కొత్తగా తీసుకుంటున్న వాలంటీర్లకు ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించాలని, ఈ అంశంలో ఎలాంటి నిర్లిప్తత పనికి రాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు జరగాలని, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పనికిరాదని మంత్రి చెప్పారు. విశాఖ జిల్లాలోని పంచ గ్రామాల సమస్యలపై కలెక్టర్ దృష్టి పెట్టాలని, ఈ గ్రామాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.