ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్ గా చల్లా మధు

చల్లా మధును ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించినట్లు సమాచారం. చల్లా మధుగా వైసీపీ శ్రేణులందరకూ చిరపరిచితుడైన చల్లా మధుసూదన్ రెడ్డి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలపడడానికి ఎంతో కష్టపడ్డారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలంగా ఎంతగానో కృషి చేశారు.

అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉంటూ…. పార్టీకోసం హైదరాబాద్ వచ్చేసి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ, జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా, ఆయన ఆశయాలకు కార్యరూపం ఇస్తూ పార్టీలో పనిచేసిన చల్లా మధుకు ఈ అవకాశం లభించడం పట్ల పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో బూత్ లెవెల్ కమిటీలకు చల్లా మధు శిక్షణను ఇచ్చారు. కన్వీనర్ గా పార్టీ నిర్ణయించిన వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన పార్టీ విజయంలో తనదైన పాత్ర పోషించారు. పార్టీ లో ఐ.టి.వింగ్ కి ప్రెసిడెంట్ గానూ, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ ఎనలేని సేవలందించారు.

నైపుణ్యం కలిగివుండి సరైన ఉపాధి లేని యువత కోసం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లే యువత కోసం, నైపుణ్యాభివృద్ధికి సరైన అవకాశాల కోసం ఎదురుచూసే యువత కోసం….. వారి వారి నైపుణ్యాలకు అనుగుణంగా వారికి స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా, వారి అభివృద్ధికి పాటుపడే కార్యక్రమాలతో ఈ కార్పోరేషన్ చైర్మన్ గా సేవలందిస్తానని చల్లా మధు అన్నారు.

ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ, సామాజిక సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన కలిగివున్న వ్యక్తిగా, పార్టీ కి అత్యంత విధేయుడుగా ఉన్న చల్లా మధుసూదన్ రెడ్డిని ఈ పదవికి సరైన వ్యక్తి గా, సమర్థుడిగా భావించి నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.