అవినీతిపరులను బీజేపీలో ఎలా చేర్చుకుంటారు?

అవినీతి, అక్రమాలతో వందల కోట్ల రూపాయలు సంపాదించిన సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ లను భారతీయ జనతా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

గురువారం ఓ ఛానెల్ నిర్వహించిన చర్చాగోష్టిలో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి బీజేపీ సామాన్య కార్యకర్తలు టెలిఫోన్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. చర్చలో టెలిఫోన్ ద్వారా పాల్గొన్న నెల్లూరు జిల్లాకు చెందిన సత్యప్రసాద్ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 330 సీట్లు కంటే ఎక్కువ వచ్చాయని, అయినా ఇంకా అవినీతిపరులైన సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ వంటి నాయకులను ఎందుకు పార్టీలో తీసుకున్నారని ప్రశ్నించారు.

” నేను ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తని, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశా. జిల్లాలో పార్టీ ప్రగతికి పాటుపడ్డాను. ఇప్పుడు అవినీతితో నిండిపోయిన నాయకులను తీసుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది” అంటూ మండిపడ్డారు.

పార్టీకి ఎలాంటి అవసరం లేకపోయినా ఇతర పార్టీలలో అవినీతిపరులను తీసుకోవడం వల్ల పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అని అన్నారు.

ఈ చర్చాగోష్టిలో స్టూడియోలోనే ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు లక్ష్మీపతి రాజు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఏ రాజకీయ పార్టీలోనైనా చేర్పులు, మార్పులు ఉంటాయని, ఇది కూడా అలాగే జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

తాటికొండ నుంచి మాట్లాడిన షేక్ మీర్జావలీ అనే బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ అవినీతిపరులను ఎందుకు మన పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. నదుల అనుసంధానం చేసింది మేమే అని చెబుతున్న తెలుగుదేశం పార్టీ వారు పట్టిసీమ ప్రాంతంలో రైతులకు ఒక్కో పార్టీకి చెందిన వారికి ఒక్కో విధంగా పరిహారం ఇచ్చారని ఆరోపించారు.

“తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి ఎకరాకు ఎక్కువ మొత్తం ఇచ్చారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఎకరాకు తక్కువ ఇచ్చారు. ఇది చర్చలో పాల్గొన్న బీజేపీ నాయకుడు లక్ష్మీపతిరాజు గారికి తెలుసు” అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జీ.కొల్లూరుకు చెందిన వెంకటరామిరెడ్డి అనే వీక్షకుడు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆత్మవంచన చేసుకుంటోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఇంతకు ముందు అవినీతిపరులైన నాయకులు మన పార్టీలోకి రాగానే పవిత్రులు అయిపోయారా..?” అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో చర్చలో పాల్గొన్న బీజేపీ నాయకుడు లక్ష్మీపతిరాజు నీళ్లు నమలడం గమనార్హం.