బాబు ప్రచారాన్నే కాదు… బాబునూ దగ్గరగా గమనిస్తున్నారు…

ఆమె సామాన్య ఇల్లాలు. ఆమె మాటలను బట్టి మధ్యతరగతి మహిళగా భావించవచ్చు. అయితే ఆంధ్రప్రేదేశ్ రాజకీయాలపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు విన్నవారికి ఔరా అని ఆశ్చర్యం కలగక మానదు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అనే అంశంపై ఓ ఛానల్ నిర్వహించిన చర్చాగోష్ఠిలో సికింద్రాబాద్ కు చెందిన హేమలత అనే మహిళ ఫోన్లో తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఈ చర్చలో పాల్గొన్న సీనియర్ నాయకులు బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి, లక్ష్మీ పార్వతి, సామాజిక వేత్త భూమన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. అంతేకాదు చర్చా గోష్ఠికి యంకర్ గా వ్యవహరించిన నాలుగు దశాబ్దాల సీనియర్ జర్నలిస్ట్ కూడా హేమలత రాజకీయ పరిణితికి అచ్చెరువొందారు. ఇది సామాన్యుల గళం అని ప్రశంసించారు.

ఇంతకీ ఈ చర్చలో హేమలత ప్రస్తావించిన అంశం తెలుగుదేశం పార్టీని ఆమె ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో అర్థమైంది. “చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారు. పోలవరంతో సహా ప్రాజేక్టులలో ఎవరు ఎంత తిన్నారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా” అని హేమలత ప్రశ్నించారు. గడచిన పదిరోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యక్రమాలను తాను టివీలో చూస్తున్నానని తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు తనకు అసహ్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యనించారు.

ఇక నిన్న, మొన్నటి వరకు ఒకరిపై ఒకరు బురద జల్లుకున్న సుజనా చౌదరి, బిజేపీ నాయకులు ఇప్పుడు ఒకరిపై ఒకరు ప్రేమ ఒలకపోసుకుంటున్నారని, హేమలత మండిపడ్డారు. “సుజనా చౌదరి ఇళ్లపైన, సంస్థలపైన ఐటి దాడులు చేయించారు. ఈయన బిజేపీ నాయకులను తీవ్రంగా విమర్శించారు. సుజనా చౌదరి బిజేపీలో చేరగానే ప్రధాని మోదీ ఫోటోలు, సుజనా చౌదరి ఫోటోలతో ఫ్లేక్సీలు ఏర్పాటు చేసారు. ఇదీ వారి రాజకీయం” అని అన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కాపుల అంశంపై అంతకు ముందు ఏం ప్రకటించారో ఇప్పుడూ అదే చెబుతున్నారని ఆమె అన్నారు. “కాపుల రిజర్వేషన్ అంశంపై మేనిఫెస్టోలో ఏం చేప్పారో అదే జగన్మోహన రెడ్డి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది గమనించాలి” అని హేమలత స్పష్టం చేసారు.