తెలంగాణ కేబినెట్ సుదీర్ఘ సమావేశం.. నిర్ణయాలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీ బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో నిర్వహించారు. దాదాపు ఐదు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. ఈ సమావేశంలో అత్యధిక సమయం చర్చించింది నూతన తెలంగాణ మున్సిపల్ చట్టం గురించే.

గతంలో తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న 1965 మున్సిపల్ చట్టం, 1994 మున్సిపల్ చట్టాల స్థానంలో సరి కొత్తగా చట్టాన్ని రూపొందించారు. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సహా జీహెచ్ఎంసీ కూడా ఒకే చట్టపరిధిలోనికి రానుంది. అంతే కాకుండా ఉద్యోగులు కూడా ఒకే మున్సిపాలిటీలో ఉండకుండా.. రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశం కల్గింది.

గతంలోని రెండు చట్టాల స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత చట్టం తీసుకొస్తున్నందున దీనిపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం కేబినెట్ ఆమోదించింది.

ఇక వృద్ధాప్య పించను వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిస్తామన్న హమీని అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. అంతే కాకుండా బీడీ కార్మికులకు సంబంధించిన పించన్ కు పీఎఫ్ కటాఫ్ తేదీని రద్దు చేసి.. పీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికి పించన్ ఇవ్వాలని కేబినెట్ అభిప్రాయపడింది.

బుధవారం నాటి కేబినెట్‌ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలు, బిల్లులు గురువారం నుంచి రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించనున్నారు.