తెలంగాణకు కొత్త మున్సిపల్ చట్టం

తెలంగాణ రాష్ట్ర శాసస సభ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 బిల్లును ప్రవేశపెట్టారు.

గతంలో తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న 1965 మున్సిపల్ చట్టం, 1994 మున్సిపల్ చట్టాల స్థానంలో సరి కొత్తగా చట్టాన్ని రూపొందించారు. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సహా జీహెచ్ఎంసీ కూడా ఒకే చట్టపరిధిలోనికి రానుంది. అంతే కాకుండా ఉద్యోగులు కూడా ఒకే మున్సిపాలిటీలో ఉండకుండా.. రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశం కల్గింది.

దీనిపై రేపు పూర్తి స్థాయిలో చర్చ జరుగనుంది. కాగా, ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఈ బిల్లుపై సవరణలు స్వీకరిస్తారు. రేపు చర్చ జరిగిన అనంతరం ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ బిల్లుపై సమాధానం ఇస్తారు.

ఇక బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసును పెంచే బిల్లును, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిస్ సవరణ బిల్లును కూడా సీఎం ప్రవేశపెట్టారు. మరోవైపు తెలంగాణ పంచాయితీరాజ్ సవరణ బిల్లు, తెలంగాణ రుణ విమోచన కమిషన్ బిల్లును మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.

కాగా, బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లును మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించారు. ఈ బిల్లుపై చర్చ ముగిసినందున బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.