అమ్మాయి చేతిలో ఓటమి.. ప్రాణాలు తీసుకున్న విద్యార్థి

నేటి జనరేషన్ పిల్లలు ఓటమిని అంగీకరించలేక పోతున్నారు. చిన్న ఓటమికే ప్రాణాలను వదిలేస్తున్నారు. పరీక్షల్లో పాస్ అవలేదని ఒకరు.. బైక్ లేదా ఫోన్ అడిగితే కొనివ్వలేదని మరొకరు.. అమ్మాయి దక్కలేదని ఇంకొకరు…. కారణం ఏదైతేనేం ప్రతీ ఒక్కరు చావే పరిష్కారం అనుకుంటున్నారు.

స్కూల్ ఎన్నికల్లో ఒక అమ్మాయి చేతిలో ఓటమి పాలయ్యానని… 8వ తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. రామన్నపేటలోని కృష్ణావేణి పాఠశాలలో సాయి చరణ్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం క్లాస్ లీడర్ ఎన్నికలు జరిగాయి. దాంట్లో సాయి‌చరణ్‌కు పోటీగా నిలబడిన ఒక అమ్మాయి లీడర్‌గా ఎన్నికైంది.

ఇక అప్పటి నుంచి సాయి చాలా దిగులుగా ఉన్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లినా తన ఓటమిని మర్చిపోలేక తనలో తను మదనపడ్డాడు. చివరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.

రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికే విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం అక్కడ పలువురిని ఆందోళనకు గురిచేసింది.