అమరావతి రియల్ ఎస్టేట్ కోసమేనా?

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణం జరగలేదని, అక్కడ జరిగిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని పలువురు పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో సేకరించిన భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తీసుకున్నవేనని ఓ చానెల్ నిర్వహించిన చర్చాగోష్టిలో పలు ప్రాంతాల నుంచి పాల్గొన్న వారన్నారు. కడప నుంచి టెలిఫోన్ లో గృహిణి చంద్రకళ మాట్లాడుతూ…. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాలు అవసరం లేదని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అన్ని వేల ఎకరాలు తీసుకున్నారని అన్నారు.

“ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సింగపూర్ రాజధాని అవసరం లేదు. మామూలు భవనాలతో ప్రజలకు సుపరిపాలన అందించే రాజధాని కావాలి. కాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం సింగపూర్ బూచిని చూపిస్తూ వేలాది ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు” అని అన్నారు. రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, కరకట్టలపై కట్టడాల వల్లే ఇబ్బందులు వస్తాయని ఆమె స్పష్టం చేశారు.

ఈ చర్చలో గుంటూరు నుంచి టెలిఫోన్ లో స్పందించిన జగ్గిరెడ్డి మాట్లాడుతూ… రాజధాని ప్రాంతమైన అమరావతి, వెలగపూడి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మారాయని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉన్న ఇంటి నుంచి డ్రైనేజీ నీరంతా పక్కనే ఉన్న నదిలోకి వదిలారని, దీంతో ఈ నీరు కలుషితం అయ్యిందని అన్నారు.

“చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి వచ్చిన మురికినీరు ఉద్దండరాయపాలెం గ్రామానికి తాగునీరుగా వెళ్లింది. అలాంటి ఇంటిని కూలగొట్టకుండా ఉంచడం మంచిదా? ” అని ప్రశ్నించారు.

చర్చలో పాల్గొన్న పిడుగురాళ్లకు చెందిన సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ” మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అల్లకల్లోలం అయిన రాష్ట్ర్రాన్ని జగన్మోహన్ రెడ్డి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజీ పడి వెనక్కి తగ్గితే రాష్ట్రం మళ్లీ ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు.