బెంగాల్‌లో స‌రికొత్త‌ సినిమా వార్ !

ప‌శ్చిమ‌బెంగాల్‌లో పాగా కోసం బీజేపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నుంచి స్కెచ్‌లు గీస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 18 సీట్లు గెలిచింది. తృణ‌మూల్ కాంగ్రెస్ 22 సీట్ల‌లో విజ‌యం సాధించింది. కాంగ్రెస్ రెండు సీట్లతో స‌రిపెట్టుకుంది. గ‌తంలో జరిగిన ఎన్నిక‌లతో పోలిస్తే…. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగింది.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఇక్క‌డ బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. తృణ‌మూల్‌కు అన్ని రంగాల్లో పోటీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే గ్రామాల్లో ఉన్న వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ వైపు తిప్పుకునే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. మెల్ల‌మెల్ల‌గా గ్రామాల్లో ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

మొన్న‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ త‌ర‌పున ముగ్గురు ఫైర్ బ్రాండ్ స్త్రీలు ఎంపీలుగా ఎన్నిక‌య్యారు. వీరంతా గ్లామ‌ర్ ఉన్న‌వారే. అంతేకాకుండా పేరుపొందిన హీరోయిన్లు. అందమేకాదు, త‌మ మాట‌ల‌తో తృణ‌మూల్‌ను వార్త‌ల్లో నిలుపుతున్నారు. జ‌నాన్ని ఆక‌ర్షిస్తున్నారు. తృణ‌మూల్‌కు పెద్ద అసెట్‌గా వీరు మారారు. దీంతో వీరికి చెక్ పెట్టేందుకు గ్లామ‌ర్ డోస్‌ను ఆశ్ర‌యించింది బీజేపీ.

బెంగాల్ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన 13 మంది సినీ తార‌లు బీజేపీలో చేరారు. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వీరు కాషాయ కండువాలు క‌ప్పుకున్నారు. బెంగాల్ సినిమాల్లో, టీవీ సీరియ‌ళ్ల‌లో వీరంతా ప్ర‌ముఖ న‌టులే.

2021లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టినుంచే రెండు పార్టీలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. బీజేపీలో చేరిక‌ల‌తో త‌మ పార్టీకి ల‌బ్ధి జ‌రుగుతుంద‌ని ఆ పార్టీ అంచ‌నా. అయితే బీజేపీ ప్రభావాన్ని క‌ట్ట‌డి చేసేందుకు మమ‌తా కొత్త కొత్త ప్లాన్‌లు వేస్తోంది. బీజేపీ ఎఫెక్ట్ మ‌రింత విస్త‌రించక ముందే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని మ‌మ‌త ఆలోచిస్తుంద‌ని స‌మాచారం.