హైదరాబాద్ సన్ రైజర్స్ కు నయా కోచ్

  • టామ్ మూడీ పోయే…ట్రెవర్ బైలిస్ వచ్చే..
  • ఇంగ్లండ్ ను ప్రపంచకప్ విజేతగా నిలిపిన బైలిస్

ఐపీఎల్ 12వ సీజన్ లో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సరికొత్త కోచ్ తో తన అదృష్టం పరీక్షించుకోనుంది. గత ఆరేళ్లుగా సన్ రైజర్స్ కు చీఫ్ కోచ్ గా సేవలు అందించిన టామ్ మూడీ స్థానంలో..ఇంగ్లండ్ జాతీయ కోచ్ ట్రెవర్ బైలిస్ ను ప్రధాన శిక్షకుడుగా నియమించుకొంది.

సక్సెస్ ఫుల్ కోచ్ బైలిస్…

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన శిక్షకులలో ఒకడిగా ట్రెవర్ బైలిస్ కు గుర్తింపు ఉంది. ఇటీవలే ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఆతిథ్య ఇంగ్లండ్ ను విశ్వవిజేతగా నిలిపిన ఘనత కూడా ట్రెవర్ బైలిస్ కు ఉంది.

2011 ప్రపంచకప్ లో శ్రీలంక రన్నరప్ గా నిలిచిన సమయంలోనూ ట్రెవర్ కోచ్ గా ఉన్నారు. అంతేకాదు…బైలిస్ కోచ్ గానే కోల్ కతా రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

బిగ్ బాష్ లీగ్, చాంపియన్స్ లీగ్ టోర్నీలలో సిడ్నీ సిక్సర్స్ జట్టును రెండుసార్లు చాంపియన్ గా నిలిపిన ఘనత సైతం ట్రెవర్ బైలిస్ కు మాత్రమే దక్కుతుంది.

2013 నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్ కు ప్రధాన శిక్షకుడిగా ఉన్న టామ్ మూడీ నేతృత్వంలో సన్ రైజర్స్ 2016లో విజేతగా, 2018 లో రన్నరప్,  2019 లో ఎలిమినేటర్ రౌండ్ స్థానాలు సంపాదించింది.

ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బైలిస్ కు న్యూసౌత్ వేల్స్ జట్టు తరపున 1985 నుంచి 1997 వరకూ ఆడిన అనుభవం ఉంది.