ఏపీ బీజేపీలో కోల్డ్‌వార్ … వారి ఆధిప‌త్య‌మే కార‌ణ‌మా?

ఏపీలో ఎదిగేందుకు బీజేపీ వేస్తున్న ప్లాన్‌లు వ‌ర్క్‌వుట్ అవుతాయో లేదో తెలియ‌దు. కానీ ఆ పార్టీలోకి వ‌స్తున్న కొత్త నేత‌ల‌తో ఆధిప‌త్య పోరు మొద‌లైంది. పాత‌,కొత్త త‌రం నేత‌ల మ‌ధ్య కోల్డ్‌వార్ అప్పుడే మొద‌లైంది. కొత్త నేత‌ల రాక‌తో పార్టీ బ‌ల‌ప‌డాలి. కానీ నేత‌ల మ‌ధ్య పోరుతో ఆ పార్టీలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం మొద‌లైంది.

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఉన్నారు. ఆయ‌నది కాపు సామాజిక‌వ‌ర్గం. ఎన్నిక‌ల ముందే ఆయ‌నకు అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కింది. అయితే ఇప్పుడు కొత్త‌గా బీజేపీలోకి టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీలు చేరారు. న‌లుగురిలో ముగ్గురు నేత‌లు సైలెంట్‌గా ఉన్నారు. సీఎం ర‌మేష్ బీజేపీ కండువా క‌ప్పుకున్న త‌ర్వాత ఏపీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. టీజీ వెంక‌టేష్ వాయిస్ వినిపించ‌డం లేదు. గ‌రిక‌పాటి మోహ‌న‌రావు కూడా యాక్టివ్‌గా లేరు.

కేంద్ర‌మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి మాత్రం హ‌డావుడి చేశారు. విజ‌య‌వాడ‌లో త‌న వ‌ర్గం నేత‌ల‌తో హంగామా చేశారు. స‌భ్య‌త్వ న‌మోదు స‌భ‌కు రాంమాధ‌వ్ లాంటి నేత‌లు హాజ‌ర‌య్యారు. కానీ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం హాజ‌రుకాలేదు. ఆయ‌న వేరే స‌భ ఉండి హాజ‌రుకాలేద‌ని అప్పుడు అంతా స‌ర్దుకున్నారు. కానీ ఇప్పుడు అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

సుజ‌నా బ్యాచ్ రాక‌తో క‌న్నా అలిగార‌ని తెలుస్తోంది. త‌న ఆధిప‌త్యానికి సుజ‌నా రాక‌తో గండిప‌డుతుంద‌నేది క‌న్నా ఆలోచ‌న‌. దీంతో పాటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు ఇప్పుడు పార్టీలో గ్రూపు క‌ట్టార‌ని స‌మాచారం. వీరంతా పార్టీని హ‌స్త‌గ‌తం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. ఢిల్లీలో ఉండే తమ కుల పెద్ద డైరెక్ష‌న్‌లోనే వీరంతా న‌డుస్తున్నార‌ని…త్వ‌ర‌లో వారి రాజకీయం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని క‌న్నా వ‌ర్గం అంటోంది.

మొత్తానికి బీజేపీలో కూడా ఆధిపత్య పోరు మొద‌లైంది. చివ‌ర‌కు ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.