వీఆర్వోల అధికారంపై కేసీఆర్ కే ఆశ్చర్యం….

అసెంబ్లీ సాక్షిగా మన వ్యవస్థపై కేసీఆర్ సంచలన నిజాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు అవినీతి , లంచాలు లేని పాలన అందిస్తామని వివరించారు. వచ్చే నెలలోనే రెవెన్యూ చట్టాన్ని మార్చబోతున్నామని.. అలాగే అధికారులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసేలా చట్టాలను మార్చేస్తున్నామని సంచలన విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మున్సిపాలిటీలు, రెవెన్యూలోని లొసుగులను వివరించాడు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలోని ఉద్యోగులు అదే సంస్థలో పుట్టి అదే సంస్థలో రిటైర్ అవుతున్నారని.. వాళ్లు లంచాలకు అలవాటు పడి తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధోరణితో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇక రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎంగా తనకు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సీసీఎల్ఏకు లేని అధికారాలు వీఆర్వోకు ఉన్నాయని.. నా భూమి మహమూద్ అలీకి.. ఆయన భూమి ఈటెల రాజేందర్ కు.. ఇలా 7 ఎకరాలుంటే మూడు.. మూడు ఉన్నవాళ్లకు ఒక ఎకరం చొప్పున మార్చేసే వీఆర్వోల అధికారాలను కొత్త చట్టంతో రూపుమాపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

కొత్త చట్టంపై అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు ఎంత లొల్లి చేసినా.. ఉద్యమించినా ప్రజలకు మేలు చేసేందుకు ఎంత కఠినంగానైనా వ్యవహరిస్తామని కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టం అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.