ఎన్ కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి – సుప్రీం కోర్టు ఆదేశం

తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు జరిగిన ఎన్ కౌంటర్ల పైన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో జరిగే ఎన్ కౌంటర్ల పైనా తప్పనిసరిగా అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

అదేవిధంగా ఎన్ కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలలోను ఎక్కడ ఎన్ కౌంటర్ జరిగినా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు రావాలని, ఆ ఎన్ కౌంటర్ పై చట్టప్రకారం విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇంతకు ముందు ఇదే అంశంపై రాష్ట్ర హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్ కౌంటర్లపై విచారణ జరిపే అంశంపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని తమ పిటీషన్ లో కోరాయి.

ఈ అంశంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు విచారణ చేసింది.

ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఎన్ కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ నమోదు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్ కౌంటర్లపై విచారణ జరపాలని, పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ పౌర హక్కుల సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసులకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది.