మున్సిపల్ చట్టం…. కేసీఆర్ కు బీజేపీ షాకిస్తుందా?

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైలెంట్ గా ఉంది. ఇప్పటికే కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కుదేలైన ఆపార్టీ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలపై కనీసం పోరాడే సామర్థ్యాన్ని కూడా తెచ్చుకోవడం లేదు. అసెంబ్లీలోనూ సైలెంట్ గానే ఉంటుంది.

అయితే బీజేపీ మాత్రం తెలంగాణలో దూకుడుగా ముందుకెళుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలిచిన బీజేపీ…. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేసులో ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా పోషిస్తూ గులాబీ దళానికి వరుసగా షాకులు ఇవ్వడానికి రెడీ అవుతోంది.

కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన మున్సిపల్ చట్టంలో కొన్ని కఠిన నిబంధనలపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మున్సిపల్ చట్టంపై తాజాగా కాంగ్రెస్ సమర్థించి సైలెంట్ గా ఉండగా.. బీజేపీ మాత్రం పోరుబాట పట్టింది.

కొత్త మున్సిపల్ చట్టంపై బీజేపీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని పక్కనపెట్టి రాష్ట్రంలో కేసీఆర్ లోపభూయిష్టంగా కొత్త మున్సిపల్ చట్టం తయారు చేశాడని బీజేపీ నేతలు విమర్శించారు.

అంతేకాదు.. తాజాగా కొత్త చట్టాన్ని పరిశీలించి… ఆపాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిసి వినతిపత్రం ఇచ్చారు.

ఇలా కాంగ్రెస్ సైలెంట్ గా ఉండగా.. మున్సిపల్ చట్టంపై బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. కేసీఆర్ అసెంబ్లీలో ఆమోదించే ఈ చట్టంపై రాజముద్ర వేయాల్సింది గవర్నరే.

మరి బీజేపీ ఆందోళనలతో ఆయన కొత్తచట్టాన్ని కార్యరూపం దాల్చుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ గా కొనసాగాలంటే బీజేపీ చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో గవర్నర్ కోర్టులో బంతి…. ఎటువైపు పడుతుందనేది ఆసక్తిగా మారింది.