తిరుమలలో 10వేల విరాళంతో వీఐపీ దర్శనం

తిరుమలలో వీఐపీ దర్శనాలకు మంగళం పాడేసిన టీటీడీ నూతన అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కలిగేలా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. సామాన్య భక్తులకు సైతం వీఐపీ ట్రీట్ మెంట్ తరహా దర్శనభాగ్యం కలిగేలా చర్యలు చేపట్టేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు.

తాజాగా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కు ఇచ్చే విరాళాలను వీఐపీ బ్రేక్ దర్శనంతో అనుసంధానించాలని భావిస్తున్నట్టు సమాచారం. విరాళాలిచ్చే సామాన్య, మధ్యతరగతి వాళ్లకు దీంతో ఈజీగా దర్శనం చేసుకోవచ్చట.

శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ (శ్రీవాణి ట్రస్ట్) ఇటీవల దేశవ్యాప్తంగా వేంకటేశ్వర దేవాలయాల సంరక్షణ, నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. ఈ కొత్త పథకంలో శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేల విరాళం ఇచ్చే భక్తుడికి వీఐపీ బ్రేక్ దర్శనం ఇచ్చే టికెట్ ను ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వీఐపీ దర్శనాలకు రాజకీయ నాయకులు, అధికారుల నుంచి లేఖలు తీసుకురావాల్సి వచ్చేది. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఈ విరాళంతో దర్శనం అనే కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.

దీనివల్ల వీఐపీ బ్రేక్ దర్శనాల పేరిట దందా నిర్వహిస్తున్న దందారాయుళ్లకు చెక్ పెట్టడం టీటీడీకి సాధ్యమవుతుంది. దాంతోపాటు వేంకటేశ్వరుడికి విరాళాలు పెరుగుతాయి. సామాన్యులు ఎలాగూ దేవుడికి సొమ్మును హుండీలో వేస్తారు. దాంతో దర్శనం టికెట్లను 10వేలు కొంటే అటు దర్శనం.. ఇటు మొక్కులు నెరవేరుతాయి. ఇప్పుడీ కొత్త పథకం భక్తులకు మేలు చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.