టార్గెట్‌ కు దగ్గరగా…. అమ్మ ఒడి ప్రభావం

ఏపీలో అమ్మ ఒడి పథకం ప్రభుత్వ స్కూళ్లకు కొత్త కల తెచ్చింది. ఈసారి భారీగా అడ్మిషన్లు జరిగాయి. అయితే ప్రభుత్వ స్కూళ్లతో పాటు, ప్రైవేట్ స్కూళ్లకు కూడా అమ్మ ఒడి వర్తింపచేయడం కొద్ది మేర ప్రతికూల ప్రభావం కూడా చూపింది. అయినప్పటికీ ప్రభుత్వ స్కూళ్లలో భారీగానే పిల్లలు చేరారు. నిర్ధేశించుకున్న లక్ష్యానికి దగ్గరగా అడ్మిషన్లు జరిగాయి.

అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో 70 లక్షల అడ్మిషన్లను విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జులై 20 నాటికి 13 జిల్లాల్లో అడ్మిషన్ల సంఖ్య 65లక్షల 76 వేలకు చేరింది. అనుకున్న లక్ష్యానికి 4 లక్షల 66 వేల అడ్మిషన్లు తక్కువగా వచ్చాయి. అమ్మ ఒడి పథకం కారణంగా గతంలో ప్రైవేట్ స్కూళ్లలో చదివిన లక్షా 9వేల మంది విద్యార్థులు ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో తొలుత అడ్మిషన్లు తీసుకున్న 10వేల 585 మంది విద్యార్థులు… అమ్మ ఒడి పథకం ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించగానే…. తిరిగి ప్రైవేట్‌ స్కూళ్లలో చేరిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం అమ్మ ఒడి వల్ల ప్రభుత్వ స్కూళ్లలో భారీగా అడ్మిషన్లు జరిగాయని… ఈ బలాన్ని నిలుపుకోవాలంటే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో అమ్మ ఒడి పథకం ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తింప చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది పిల్లలు తిరిగి ప్రైవేట్ స్కూళ్ల వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు.