నిశ్శబ్దం అంటున్న అనుష్క

‘భాగమతి’ సినిమా తరువాత సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకుని బరువు తగ్గిన బాహుబలి బ్యూటీ అనుష్క శెట్టి త్వరలో తన తదుపరి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం లో మాధవన్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, హాలీవుడ్ నటుడు మైకెల్ మ్యాడ్సన్, అంజలి, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈచిత్రం టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సినిమా టైటిల్ ‘నిశ్శబ్ధం’ అని రివీల్ చేస్తున్న ఈ పోస్టర్ లో సైన్ లాంగ్వేజ్ లో సైలెన్స్ అని చెబుతున్నట్టుగా చేతుల బొమ్మ ఉంది.

అనుష్క పాత్ర ఈ సినిమాలో విభిన్నంగా ఉండబోతోందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ టైటిల్ పోస్టర్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

2020లో ‘నిశ్శబ్దం’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల కాబోతున్న ఈ సినిమా తమిళం మరియు హిందీ భాషలలో కూడా ‘సైలెన్స్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో అనుష్క తన విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.