వీసీ రాజీనామా కోసం ఆందోళన

ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాంగణం కులాలు, వర్గాల అంతర్గత కుమ్ములాటలతో అట్టుడుకుతోంది. దీనికి రాజకీయం కూడా తోడైంది. వీసీ యెడ్ల సుధాకర్‌ రాజీనామా చేయాలంటూ ఒక వర్గానికి చెందిన విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది చేసిన ఆందోళనకు మద్దతుగా వైసీపీ రంగప్రవేశం చేసింది. ద్రావిడ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం వద్ద ధర్నాకు దిగారు.

వీసీ నియంతలా వ్యవహరిస్తున్నాడని, యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా నియమితులైన ఆయన కోర్టు ఆదేశాల ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దశలో కుప్పం వ్యవసాయ మార్కెట్టు కమిటీ మాజీ ఛైర్మన్‌ సెంథిల్‌ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నాయి.

పరిపాలనా భవనంలో వీసీ లేరని తెలుసుకున్న తర్వాత… ర్యాలీగా ఆయన బంగ్లాకు వెళ్లారు. వీసీ బంగ్లా తలుపులు తెరుచుకోకపోవడంతో వాటిని బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న గుడుపల్లె ఎస్ఐ వెంకటేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.

రిజిస్ట్రార్‌ పెంచలయ్య వెలుపలికి వచ్చి సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో పోలీసులు మంతనాలు జరిపాక వీసీ సుధాకర్‌ వెలుపలికి వచ్చారు.

ద్రావిడ వర్శిటీ ప్రాంగణ పరిధిలోని క్వారీ యజమానులకు కొమ్ము కాస్తూ, వారి నుంచి నెలనెలా వీసీ ముడుపులు స్వీకరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందిని వర్గాలుగా విభజించి, ఒక వర్గానికి అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ… మిగిలినవారిని ఇబ్బందులు పెడుతున్నాడని విమర్శించారు.

ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేయకుండా ఎందుకు పదవిని పట్టుకుని వేలాడుతున్నాడని నిలదీశారు. గవర్నర్‌ తనను నియమించారు కాబట్టి, ఆయన కానీ, ఆయన తరఫున ప్రభుత్వం కానీ ఆదేశాలిస్తే రాజీనామా చేస్తానని వీసీ స్పష్టం చేశారు. ఈ సమాధానంతో ఆందోళనకారులు మరింత ఆవేశానికి లోనవడంతో సోమవారం వీసీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో ఆందోళనకారులు వెనుదిరిగారు.